మంగళగిరిలో చిరువ్యాపారులకు అధునాతన 'యూరో కార్ట్స్' అందించిన నారా లోకేశ్

Nara Lokesh distributes Euro Carts to poor in Mangalagiri
  • నేడు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ పర్యటన
  • పేదలకు ఉపాధి కోసం తోపుడు బండ్లు అందజేత
  • మంగళగిరి నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన లోకేశ్
  • ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. పేదలు ఉపాధి పొందేందుకు వీలుగా వారికి అధునాతన తోపుడు బండ్లు (యూరో కార్ట్స్) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు నారా లోకేశ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ తోపుడు బండ్లు సోలార్ శక్తితో పనిచేస్తాయి. వీటికి పైభాగం సోలార్ ప్యానెళ్లు అమర్చారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిరువ్యాపారులకు ఆశీలు ఫీజు రద్దు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో చిరువ్యాపారుల జీవనోపాధికి ఇప్పటికే వివిధ రూపాల్లో చేయూతనిస్తున్న నారా లోకేశ్ బుధవారం నాడు మరో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 

ఎన్ఆర్ఐ టీడీపీ సహకారంతో చిరువ్యాపారుల ఆదాయాన్ని కనీసం 50 శాతం పెంచే దిశగా అధునాతన యూరోకార్టు సేవలను ప్రారంభించారు. రోడ్లవెంట టిఫిన్ బండ్లపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులకు పాశ్చాత్య దేశాల్లో మాదిరి అధునాతన సదుపాయాలతో కూడిన యూరోకార్టులను అందజేశారు. 

ముఖ్యమంత్రి జగన్ సంక్షేమం పేరుతో కుడి చేత్తో రూ.10 ఇచ్చి, ఎడమచేత్తో వందలాగేస్తున్నారని అన్నారు. వీధి వ్యాపారులకు వడ్డీలేని రుణాల పేరుతో 10 వేలు ఇస్తున్నారని, ఇదే సమయంలో ఆశీలు పేరుతో ఏటా రూ.10,800 లాగేస్తున్నారని తెలిపారు. చిరువ్యాపారులు ఎక్కడైతే రోజువారీ బళ్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారో, వారికి అక్కడే లైసెన్సులు ఇచ్చి పోలీసు వేధింపులు లేకుండా చేస్తామని తెలిపారు. చిరువ్యాపారుల బళ్లవద్ద చెత్తను మున్సిపాలిటీల ద్వారా సేకరించే విధంగా ఏర్పాటుచేస్తామన్నారు. 

యూరోకార్టులు పొందిన లబ్ధిదారులకు బ్యాంకుద్వారా వర్కింగ్ క్యాపిటల్ సమకూరుస్తున్నందున అడ్డగోలు వడ్డీల బెడద ఉండదని తెలిపారు. శుభ్రత విషయంలో వెస్టిన్ హోటల్ మేనేజ్మెంట్ వారిచే 5 స్టార్ హోటల్స్ కి దీటుగా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. 

యూరోకార్టుల ప్రత్యేకతలివే!

అధునాతంగా రూపొందించిన యూరోకార్టులు తేలికగా శుభ్రం చేసుకోవడానికి అనువుగా ఉంటాయి. శుభ్రత విషయంలో వెస్టిన్ హోటల్ మేనేజ్‌మెంట్ స్కూల్  వారు ముందుగా చిరువ్యాపారులకు ఉచితంగా శిక్షణ ఇస్తారు. చిరువ్యాపారులకు అవసరమైన రోజువారీ సరుకులను ఆర్డర్ పై వేర్వేరు బ్రాండెడ్ స్టోర్స్ వారు బండి దగ్గరకే పంపే విధంగా ఏర్పాట్లుచేశారు. ఈ లావాదేవీలకి అవసరమైన బ్యాంకు సేవలను హెచ్‌డీఎఫ్‌సీ వారు అందిస్తారు. 

రోజువారీ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతో పాటు యూరోకార్టు స్క్రీన్ పై ప్రకటనల ద్వారా కూడా మరికొంత ఆదాయం లభించే అవకాశం ఉంది. ఎన్ఆర్ఐ టీడీపీకి చెందిన ప్రవాస భారతీయుడు గుంటుపల్లి జయకుమార్, మురళి రాపర్ల సహకారంతో బుధవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని ఇంటివద్ద నారా లోకేశ్ చేతులమీదుగా ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. 

ఈ కార్యక్రమం లో నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, ఇతర ముఖ్యనేతలు, ఎన్ఆర్ఐ టిడిపి కి చెందిన గుంటుపల్లి జై కుమార్, మురళీ రాపర్ల, యూరో కార్ట్ డిజైనర్ కృష్ణం రాజు, వెస్ట్ ఇన్ ట్రైనర్ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Euro Carts
Mangalagiri
TDP

More Telugu News