Bazball: ఇంగ్లండ్ 'బజ్ బాల్' ఇక్కడ పనిచేయదు... టీమిండియా మాజీల వ్యాఖ్యలు

  • భారత్ లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ జట్టు
  • టెస్టు సిరీస్ ను టీమిండియాకు కోల్పోయిన వైనం
  • తుస్సుమంటున్న బజ్ బాల్ క్రికెట్
  • సొంతగడ్డపై భారత్ ను ఢీకొట్టడం ఏమంత సులువు కాదన్న అనిల్ కుంబ్లే
  • ఈ సిరీస్ లో బజ్ బాల్ కనిపించలేదన్న ఆకాశ్ చోప్రా
Team India former cricketers criticises England trade mark Bazball cricket

బెన్ స్టోక్స్ కెప్టెన్ గా, బ్రెండన్ మెకల్లమ్ కోచ్ గా వచ్చాక ఇంగ్లండ్ టెస్టు జట్టు స్వరూపమే మారిపోయింది. టెస్టుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ తో బజ్ బాల్ క్రికెట్ కు నాంది పలికింది. వరుసగా సిరీస్ లు గెలుస్తూ టెస్టుల్లో భీకర జట్టుగా ఎదిగింది. కానీ, అదంతా హైదరాబాద్ టెస్టు వరకే పరిమితం. 

టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టు హైదరాబాద్ లో జరగ్గా... ఆ మ్యాచ్ ను ఇంగ్లండ్ గెలవడంతో అందరూ ఔరా అనుకున్నారు. బజ్ బాల్ క్రికెట్ భలే ఫలితాలను ఇస్తోందే అనుకున్నారు. కానీ, రెండో టెస్టు నుంచి కథ తారుమారు అయింది. 

తొలి టెస్టు ఓడిన రోహిత్ సేన వరుసగా మూడు టెస్టుల్లో నెగ్గి సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్ లో ఇంగ్లండ్ చేయడానికి ఏమీ లేదు. మార్చి 7 నుంచి ధర్మశాలలో చివరిదైన ఐదో టెస్టు జరగనుండగా, ఇప్పటికే సిరీస్ ఫలితం తేలిన నేపథ్యంలో ఆ మ్యాచ్ నామమాత్రంగా మారింది. అందులో గెలిస్తే ఇంగ్లండ్ కు పరువు దక్కే అవకాశాలున్నా, టీమిండియా ఊపు చూస్తే ఆ మ్యాచ్ ను కూడా వదిలేలా లేదు. 

ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

"ఇంగ్లండ్ ఆడేది బజ్ బాల్ క్రికెట్ కావొచ్చు, ఇంకేదైనా కావొచ్చు... కానీ ఇది భారత్. ఇక్కడ టీమిండియాపై ఆధిపత్యం చెలాయించడం ఏమంత సులభం కాదు. పదేళ్లుగా టీమిండియా సొంతగడ్డపై ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. ఈ సిరీస్ లో ఇంగ్లండ్ బౌలింగ్ దాడుల్లో పస లేదు. అలాంటి పేలవ బౌలింగ్ దాడులతో టీమిండియాను సవాల్ చేయలేరు. దూకుడుగా  బ్యాటింగ్ చేయాలని చెప్పడం సులభమే... కానీ భారత్ లో ఇతర జట్లు అలా ఆడడం కష్టం" అని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. 

"అందరూ బజ్ బాల్ అంటున్నారు... కానీ అది ఈ సిరీస్ లో కనిపించలేదు. తొలి టెస్టులో 190 పరుగులు వెనుకబడి ఉన్నప్పటికీ ధాటిగా ఆడి ఆధిక్యంలోకి వచ్చి, చివరికి ఆ మ్యాచ్ ను గెలిచి... ఇదే బజ్ బాల్ అన్నారు... అంతవరకు బాగానే ఉంది. కానీ అది అన్నివేళలా పనికిరాదని ఆ తర్వాత టెస్టుల్లో నిరూపితమైంది. మిగతా మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ కు ఓటమి తప్పలేదు. స్టార్ ఆటగాడు జో రూట్ ను తన స్వాభావిక ఆట ఆడుకోనివ్వాలి. రూట్ పైనా బజ్ బాల్ రుద్దడం అతడి ఆటను దెబ్బతీసింది. డిఫెన్స్ ఆడుతూనే స్కోరుబోర్డును ముందుకు నడిపించడం రూట్ శైలి. అతడిని అతడి శైలికే వదిలేయాలి. బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ లపై బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ ఏమీ చేయలేకపోయారు. ఇంగ్లండ్ తన దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తుందేమో కానీ, ఫలితాలు రాబట్టడంలో మాత్రం విఫలమవుతోంది" అని ఆకాశ్ చోప్రా వివరించాడు.

More Telugu News