Jan Nicol Loftie Eaton: ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన నమీబియా బ్యాటర్ జాన్ నికోల్.. వెనుకబడ్డ రోహిత్ శర్మ

  • కేవలం 33 బంతుల్లోనే సెంచరీ చేసిన జాన్ నికోల్
  • టీ20 ఫార్మాట్‌లో వేగవంతమైన సెంచరీగా రికార్డు నమోదు
  • నేపాల్‌పై చెలరేగి ఆడిన నమీబియా బ్యాట్స్‌మెన్
Namibia batsman Jan Nicol Loftie Eaton made Century just in 33 ball and creates recored in t20 cricket

నమీబియా క్రికెటర్ జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ చరిత్ర సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దీంతో టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా జాన్ నికోల్ అవతరించాడు. మంగళవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును నెలకొల్పాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. మొత్తంగా 36 బంతుల్లో 101 పరుగులు చేశాడు. టీ20ల్లో అంతకుముందు 34 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసిన నేపాలీ ఆటగాడు కుశాల్ మల్లా కళ్ల ముందే జాన్ నికోల్ రికార్డును తిరగరాయడం గమనార్హం. 2023లో మల్లా కేవలం 34 బంతుల్లో శతకం బాదాడు. 

నెదర్లాండ్స్‌ కూడా ఆడుతున్న ట్రై సిరీస్‌లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది. కీర్తిపూర్‌లోని త్రిభువన్ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జాన్ సెంచరీతో నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేయగలిగింది. కాగా లక్ష్య ఛేదనలో నేపాల్ విఫలమైంది. 18.5 ఓవర్లలో 186 పరుగులకు ఆ జట్టు ఆలౌట్ అయింది. దీంతో నమీబియా ఘనవిజయం సాధించింది.

టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు...
1. జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ - 33 బంతులు(నేపాల్‌పై)
2. కుశాల్ మల్లా - 34 బంతులు (మంగోలియాపై)
3. డేవిడ్ మిల్లర్ - 35 బంతులు (బంగ్లాదేశ్‌పై)
4. రోహిత్ శర్మ - 35 బంతులు (శ్రీలంకపై)
5. సుధేష్ విక్రమశేఖర - 35 బంతులు (టర్కీపై).

More Telugu News