Pawan Kalyan: భారత క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమా?: పవన్ కల్యాణ్

  • హనుమ విహారి కేంద్ర బిందువుగా ఆంధ్రా రంజీ క్రికెట్లో వివాదం
  • అనూహ్యరీతిలో కెప్టెన్సీ కోల్పోయిన హనుమ విహారి
  • హనుమ విహారికి సంఘీభావం ప్రకటించిన పవన్ కల్యాణ్ 
Pawan Kalyan extends solidarity to cricketer Hanuma Vihari

అవాంఛనీయ పరిస్థితుల్లో ఆంధ్రా రంజీ టీమ్ కెప్టెన్సీ కోల్పోయిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారికి జనసేనాని పవన్ కల్యాణ్ సంఘీభావం ప్రకటించారు. ఒక వైసీపీ కార్పొరేటర్ కారణంగానే హనుమ విహారి తన కెప్టెన్సీకి రాజీనామా ప్రకటించాల్సి వచ్చిందని పవన్ స్పష్టం చేశారు. భారత క్రికెటర్, ఆంధ్రా రంజీ టీమ్ కెప్టెన్ కంటే... ఎటువంటి క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ లేని స్థానిక వైసీపీ నాయకుడే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు చాలా విలువైన వ్యక్తిగా మారడం ఎంత అవమానం! అని పేర్కొన్నారు.

 భారత క్రికెట్ జట్టుకు 16 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలు సాధించిన విహారి... ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టులో కనబరిచిన పోరాట పటిమ మరువలేనిది అని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్ గా గత ఏడేళ్లలో ఆంధ్ర జట్టు ఐదుసార్లు నాకౌట్ దశకు అర్హత సాధించడంలో హనుమ విహారి పాత్ర ఎంతో ప్రముఖమైనదని వివరించారు. 

ఓసారి విరిగిన చేతితో ఆడాడు... మరోసారి మోకాలి గాయంతో ఆడాడు... భారత జట్టు కోసం, మరీ ముఖ్యంగా ఆంధ్రా రంజీ టీమ్ కోసం తన క్రీడాశక్తినంతటినీ ధారపోశాడు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.  

"జగన్ మోహన్ రెడ్డి గారూ... మన ఆంధ్రా రంజీ టీమ్ కెప్టెన్ ను రాష్ట్ర క్రికెట్ సంఘం దారుణంగా అవమానించినప్పుడు ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఉపయోగం ఏంటి?" అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. 

"ప్రియమైన హనుమ విహారి గారూ... మీరు దేశానికి, రాష్ట్రానికి చాంపియన్ ప్లేయర్. మీ విశిష్ట సేవలతో ఆంధ్రాలోని చిన్న పిల్లల్లో స్ఫూర్తిని నింపి, క్రీడాకారులను ఉత్తేజపరిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

తెలుగువారిగా, క్రికెట్ ను అమితంగా ఇష్టపడే వ్యక్తులుగా... మీకు జరిగిన అన్యాయానికి, మన రాష్ట్ర క్రికెట్ సంఘం మీ పట్ల వివక్ష చూపిన తీరుకు మేం చింతిస్తున్నాం. మీకు భవిష్యత్ లో మంచి జరగాలని కోరుకుంటున్నాను. 

అలాగే... ఆటగాళ్లను గౌరవించడం తెలిసిన రాష్ట్ర క్రికెట్ సంఘంతో మీరు వచ్చే ఏడాది మళ్లీ ఆంధ్రా తరఫున ఆడతారని నేను విశ్వసిస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

More Telugu News