Rohit Sharma: టీమ్ లోకి కోహ్లీ తిరిగొచ్చినా మాకు ఇబ్బందేమీ లేదు: రోహిత్ శర్మ

  • కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు అంచనాలకు మించి రాణిస్తున్నారన్న రోహిత్
  • కుర్రాళ్లకు స్వేచ్ఛనిచ్చి వాళ్ల ఆట వాళ్లను ఆడనిచ్చామని వెల్లడి
  • ఐదో టెస్టులో కూడా ఇదే ఉత్సాహంతో బరిలోకి దిగుతామన్న కెప్టెన్
Rohit Sharma on young players

ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా జట్టు అదరగొడుతోంది. బలమైన ఇంగ్లాండ్ జట్టు వరుస విజయాలు సాధిస్తూ ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకుంది. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్ వంటి యంగ్ ప్లేయర్స్ తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటారు. 

ఈరోజు నాలుగో టెస్టులో విజయం సాధించిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... టెస్ట్ సిరీస్ లో జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నామని చెప్పాడు. యువ ఆటగాళ్లు సత్తా చాటారని కితాబునిచ్చాడు. ఇంగ్లాండ్ నుంచి ఎదురైన సవాళ్లను తట్టుకుని విజయం సాధించడం గొప్ప అనుభూతిని ఇస్తోందని చెప్పాడు. కొత్తగా టీమ్ లోకి వచ్చిన ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించారని పేర్కొన్నాడు. తాను, కోచ్ రాహుల్ ద్రావిడ్ చేసింది ఒకటేనని... కుర్రాళ్లకు స్వేచ్ఛనిచ్చి వాళ్ల ఆట వాళ్లను ఆడనిచ్చామని చెప్పాడు. యువ ఆటగాళ్లు ఒత్తిడికి గురి కాకుండా చూడటమే తమ బాధ్యత అని అన్నాడు. 

టీమిండియా యువ ఆటగాళ్లతో నిండిపోయిందని చెప్పాడు. కోహ్లీ వంటి సీనియర్లు జట్టులోకి తిరిగొచ్చినా తమకు ఇబ్బంది లేదని... జట్టు కూర్పు విషయంలో ఎలాంటి ఒత్తిడి ఉండదని తెలిపాడు. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పాడు. ఐదో టెస్టులో కూడా ఇదే ఉత్సాహంతో బరిలోకి దిగుతామని తెలిపాడు.

More Telugu News