Hanuma Vihari: హనుమ విహారి ప్రకటనపై స్పందించిన ఆంధ్రా క్రికెట్ సంఘం

  • ఆంధ్రా రంజీ టీమ్ కెప్టెన్సీ వివాదంపై హనుమ విహారి ప్రకటన
  • ఓ ఆటగాడిపై కోప్పడ్డానని వెల్లడి 
  • రాజకీయ ఒత్తిడి కారణంగా కెప్టెన్సీ పోయిందని వ్యాఖ్యలు
  • తమకు ఆటగాళ్లందరూ సమానమేనన్న ఆంధ్రా క్రికెట్ సంఘం
Andhra Cricket Association reacts on Hanuma Vihari statement

తాను ఆంధ్రా రంజీ టీమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి దారితీసిన పరిస్థితులను టీమిండియా క్రికెటర్ హనుమ విహారి ఓ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఓ ఆటగాడిపై కోప్పడ్డానని, అతడి తండ్రి ఓ రాజకీయ నాయకుడు కావడంతో, తనను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేశారని హనుమ విహారి ఆరోపించాడు. ఈ ఆరోపణలపై ఆంధ్రా క్రికెట్ సంఘం స్పందించింది.

"హనుమ విహారి ప్రకటనను మేం చూశాం. ముఖ్యంగా అతడు కెప్టెన్సీ విషయంలో ఆంధ్రా క్రికెట్ సంఘంపై ఆరోపణలు చేశాడు. ఆంధ్రా క్రికెట్ సంఘం ఆటగాళ్లందరినీ సమానంగా చూస్తుంది. సీనియారిటీ ఆధారంగా ఆటగాళ్లకు అనుకూలంగా వ్యవహరించడం గానీ, లేకపోతే వారికి ప్రాధాన్యత ఇవ్వడం గానీ జరగదు. 

ఇక అసలు విషయానికొస్తే... బెంగాల్ తో  రంజీ మ్యాచ్ సందర్భంగా ఓ ఆటగాడిని హనుమ విహారి అందరి ముందు వ్యక్తిగతంగా దూషించాడన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఆ క్రికెటర్ ఆంధ్రా క్రికెట్ సంఘానికి ఫిర్యాదు చేశాడు. 

2024 జనవరిలో మొదటి రంజీ మ్యాచ్ ముగిశాక సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ నుంచి మాకు ఓ ఈమెయిల్ వచ్చింది. జాతీయ బాధ్యతల నేపథ్యంలో సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండలేనంటూ విహారి తెలుపడంతో అతడి స్థానంలో కొత్త కెప్టెన్ ను ప్రతిపాదిస్తూ పంపిన ఈమెయిల్ అది. సీనియర్ బ్యాట్స్ మన్ రికీ భుయ్ ని కొత్త కెప్టెన్ గా నియమిస్తున్నట్టు సెలెక్షన్ కమిటీ పేర్కొంది. ఈ నిర్ణయం పట్ల నాడు హనుమ విహారి కూడా హర్షం వ్యక్తం చేశాడు. 

క్రికెటర్ ను దూషించిన వ్యవహారంలో హనుమ విహారి అసభ్యకరమైన భాష ఉపయోగించినట్టు జట్టులోని ఇతర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఆంధ్రా క్రికెట్ సంఘం అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. అంతకుముందు కూడా, ముస్తాక్ అలీ టోర్నమెంట్ సమయంలో జట్టులో గ్రూపులు ఏర్పడ్డాయని ఆంధ్రా టీమ్ మేనేజర్ నివేదిక ఇచ్చాడు. 

హనుమ విహారి హైదరాబాద్ రంజీ టీమ్ నుంచి ఆంధ్రా టీమ్ కు మారాడు. అప్పటి నుంచి తరచుగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అడుగుతుండేవాడు. తనకు ఇతర రాష్ట్రాల నుంచి ఆఫర్లు వస్తున్నాయని చెప్పేవాడు. 

ఎందుకో గానీ, ఉన్నట్టుండి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తన వల్ల కలిగిన అసౌకర్యానికి మన్నించాలని కోరుతూ, ఆంధ్రా రంజీ జట్టులో కొనసాగుతానని చెప్పాడు. హనుమ విహారి అనుభవం ఆంధ్రా రంజీ క్రికెట్ టీమ్ కు ఉపయోగపడుతుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, అతడు జట్టులో కొనసాగేందుకు ఆమోదం తెలిపాం. 

ఇప్పుడు అన్ని ఫిర్యాదులపై క్షుణ్ణంగా విచారణ జరుపుతాం. ఎలాంటి చర్యలు తీసుకుంటామన్నది త్వరలోనే తెలియజేస్తాం" అని ఆంధ్రా క్రికెట్ సంఘం మీడియా మేనేజర్ డి.రాజగోపాల్ పేరిట ఓ ప్రకటన విడుదల చేశారు.

More Telugu News