Devineni Uma: సిగ్గులేకుండా చెప్పుకుంటావా... కుప్పంలో సీఎం జగన్ వ్యాఖ్యలకు దేవినేని ఉమా కౌంటర్

  • కుప్పం సభలో చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించిన సీఎం జగన్
  • నువ్వా రాయలసీమను ఉద్ధరించింది అంటూ దేవినేని ఉమా ఫైర్
  • దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్
  • డబ్బా కొట్టుకుంటున్నారని వ్యాఖ్యలు
Devineni Uma counters CM Jagan remarks in Kuppam meeting

కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం వద్ద ఏర్పాటు చేసిన వైసీపీ సభలో సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏంచేశారని నిలదీశారు. తాము కుప్పం నియోజకవర్గానికి కృష్ణా నీటిని తీసుకువచ్చామని చెప్పారు. ఈ నేపథ్యంలో, సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా బదులిచ్చారు. 

"చంద్రబాబు డ్యాముల్లో నీళ్లు నిలబెట్టాడు. రిజర్వాయర్లలో నీళ్లు నిలబెట్టాడు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు హంద్రీనీవా పనులను 672 కిలోమీటర్ల మేర పరుగులు తీయించారు. ఆ 672 కిలోమీటర్లు పనులు నేనే పూర్తి చేశానని సిగ్గు లేకుండా చెప్పుకుంటావా? చిత్రావతి, గండికోట, పులివెందుల లిఫ్ట్ కింద ఎక్కడైనా ఒక్క ఎకరానికి నీరిచ్చావా? గాలేరు-నగరి సుజల స్రవంతిని గాలికి వదిలేశావు కదా! 

తెలుగుగంగ పనులేమైనా ముందుకెళ్లాయా? రాయలసీమ లిఫ్ట్ ఉద్ధరిస్తానన్నావు... ఏమైపోయింది? ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టావు... సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా? నువ్వా రాయలసీమను ఉద్ధరించింది? మీరు ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్న రూ.22 వేల కోట్లలో ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పే దమ్ము ధైర్యం ఉందా మీకు, మీ ఇరిగేషన్ మంత్రికి? దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలి. 

రాయలసీమకు మీరు కేటాయించినట్టు చెప్పుకుంటున్న రూ.2,011 కోట్లలో ఏ ప్రాజెక్టుకు  నీరిచ్చావు జగన్ రెడ్డీ... ఏ రిజర్వాయర్ కు నీళ్లిచ్చావు జగన్ రెడ్డీ... ఏ కాలువకు నీళ్లు వెళ్లాయి జగన్ రెడ్డీ? మేం దమ్ము ధైర్యంతో చెబుతున్నాం... హంద్రీనీవా కాలువకు మేం 40-45 టీఎంసీల నీళ్లు నడిపించాం. కర్నూలు, అనంతపురంకు నీళ్లిచ్చాం. చిత్తూరుకు నీళ్లు తీసుకెళ్లాం. 

కుప్పం బ్రాంచి కెనాల్ లో రెండో లిఫ్టు నుంచి మూడో లిఫ్టుకు నీళ్లు తీసుకురావడానికి 57 నెలలు పట్టిందని, రూ.30 కోట్లు ఖర్చు పెట్టానని నువ్వు డబ్బా కొట్టుకుంటావా, నువ్వు ఉద్ధరించినట్టు చెప్పుకుంటావా? ఎన్నికలకు పట్టుమని 40 రోజులు లేవు... నీ మూడు రిజర్వాయర్ల డ్రామాలు ఏంటి జగన్ రెడ్డీ?" అంటూ దేవినేని ఉమా ధ్వజమెత్తారు.

కుప్పం కెనాల్ మీద చంద్రబాబు హయాంలో 87 శాతానికి పైగా పనులు పూర్తయితే, మిగిలిన 13 శాతం పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ, అసమర్థ ముఖ్యమంత్రి జగన్... నీ బడాయి కబుర్లకు అర్థముందా? అని నిలదీశారు.

More Telugu News