Ganta Srinivasa Rao: చంద్రబాబు నన్ను తిట్టారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు: గంటా

  • నిన్న టీడీపీ తొలి జాబితా ప్రకటన
  • పలువురు సీనియర్ల పేర్లు లేని వైనం
  • నేడు చంద్రబాబును కలిసిన గంటా
Ganta Srinivasarao met Chandrababu

టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల మొదటి జాబితాలో పేరు లేని వారిలో విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. ఇవాళ ఆయన ఉండవల్లిలో చంద్రబాబును కలిసి చర్చించారు. 

అనంతరం ఆయన స్పందిస్తూ... చంద్రబాబు నన్ను తిట్టారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. 

తొలి జాబితాలో పేరు లేకుంటే సీనియర్లను అవమానించినట్టు కాదని పేర్కొన్నారు. పొత్తుల వల్ల సీటు దక్కని వారికి పార్టీ న్యాయం చేస్తుందని తెలిపారు. సీట్ల సర్దుబాటు టీడీపీ-జనసేన అంతర్గత వ్యవహారం అని గంటా స్పష్టం చేశారు. 

చంద్రబాబు ఈసారి చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని తనకు సూచించారని వెల్లడించారు. అయితే భీమిలి నుంచి పోటీ చేస్తానని చంద్రబాబుతో చెప్పానని వివరించారు. నువ్వెక్కడ పోటీ చేసినా గెలుస్తావని చంద్రబాబు నాతో అన్నారు అని వెల్లడించారు. ఎక్కడ పోటీ చేయించాలన్న విషయాన్ని తనకు వదిలిపెట్టాలని చంద్రబాబు తెలిపారు అని గంటా  పేర్కొన్నారు. 

టీడీపీ తొలి జాబితా ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని అన్నారు. మొదటి జాబితాపై ప్రజాస్పందన బాగుందన్న విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో, వైసీపీ ఓడడం కూడా అంతే నిజం అని స్పష్టం చేశారు. 70 మందిని ప్రకటించడానికి వైసీపీ 7 జాబితాలు విడుదల చేసిందని ఎద్దేవా చేశారు. 

కాగా, ఇవాళ చంద్రబాబును దేవినేని ఉమా, పీలా గోవింద్, గండి బాబ్జీ తదితరులు కూడా కలిశారు. తొలి జాబితాలో పేరు లేకపోవడం పట్ల చంద్రబాబు వారికి పరిస్థితిని వివరించారు. ఈ భేటీ సందర్భంగా మీ మాటే నాకు శిరోధార్యం అని, నేను చంద్రబాబు మనిషిని అని దేవినేని ఉమా అన్నట్టు తెలుస్తోంది.

More Telugu News