Indian Youth: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయుడు మృతి

  • ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో చనిపోయినట్లు వెల్లడించిన మరో ఇండియన్
  • ఏజెంట్ చేతిలో మోసపోయి రష్యా సైన్యంలో చేరామని ఆవేదన
  • తమను ఎలాగైనా రక్షించాలంటూ విదేశాంగ శాఖకు విజ్ఞప్తి
Gujarathi Youth Dead In Russia Ukraine war

రష్యాలో సెక్యూరిటీ ఉద్యోగం పేరుతో ఏజెంట్ చేసిన మోసానికి భారతీయ యువకుడు ఒకరు బలయ్యారు. రష్యా ప్రైవేటు సైన్యంలో చేరిన గుజరాతీ యువకుడు ఈ నెల 21న జరిగిన డ్రోన్ దాడిలో మరణించాడు. ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న మరో యువకుడు వీడియో సందేశంలో ఈ వివరాలు వెల్లడించాడు. సెక్యూరిటీ ఉద్యోగాలంటే ఆశపడి వచ్చామని.. తీరా ఇక్కడికి వచ్చాక తమకు ఆయుధాలు ఇచ్చి ఉక్రెయిన్ సరిహద్దుల్లో వదిలేశారని చెప్పుకొచ్చాడు. గతేడాది డిసెంబర్ లో రష్యాకు వచ్చినట్లు తెలిపాడు. కొన్ని రోజులు శిక్షణ ఇచ్చి యుద్ధంలో పాల్గొనేందుకు పంపించారని తెలిపాడు.

ఈ నెల 21న రష్యా ఆక్రమిత డొనెట్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. రష్యా సైనికుల క్యాంపుపై డ్రోన్ ద్వారా బాంబులు జారవిడిచింది. ఆ సమయంలో రష్యా సైనికులతో పాటు అక్కడ భారతీయ యువకులు కూడా ఉన్నారు. సూరత్ కు చెందిన బాధితుడు హేమిల్ అశ్విన్ భాయ్ మంగుకియా తనకు ఇచ్చిన వెపన్ తో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కర్ణాటకకు చెందిన సమీర్ అహ్మద్ మరో ఇద్దరు భారతీయ యువకులతో కలిసి సెంట్రీ డ్యూటీ చేస్తున్నాడు. ఇంతలో బాంబు పడడంతో దగ్గర్లోని కందకంలో దాక్కున్నట్లు సమీర్ చెప్పాడు. కాసేపటి తర్వాత వెళ్లి చూడగా.. హేమిల్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని తెలిపాడు.

హేమిల్ మృతదేహాన్ని వ్యాన్ లోకి ఎక్కించి అక్కడి నుంచి పంపించేశారని చెప్పుకొచ్చాడు. మోసపోయి సైన్యంలో చేరిన తమను ఎలాగైనా కాపాడాలని, రష్యా నుంచి బయటకు తీసుకెళ్లాలని బాధిత యువకులు విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వీడియో సందేశాన్ని సమీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అక్కడ చిక్కుకుపోయిన పలువురు భారతీయులు రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగా, హేమిల్‌ మృతిపై తమకు సమాచారంలేదని విదేశాంగశాఖ పేర్కొంది.

More Telugu News