Stuart Brad: రాంచీ పిచ్‌ను ఎందుకు సిద్ధం చేశారో అర్థం కావడంలేదు.. తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ దిగ్గజం

  • పిచ్‌పై పగుళ్లు ఉండడంపై విమర్శలు గుప్పించిన ఇంగ్లండ్ మాజీ ఆటగాడు సువర్ట్ బ్రాడ్
  • రాంచీ లాంటి పిచ్‌లు ప్రత్యర్థి జట్లకు మేలు చేస్తాయని వ్యాఖ్య
  • బుమ్రాకు ఎందుకు విశ్రాంతి ఇచ్చారో అర్థం కాలేదన్న ఇంగ్లండ్ మాజీ ఆటగాడు
I donot understand why the Ranchi pitch was prepared says England former bower Stuart Brad

భారత్, ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్‌లో అత్యంత కీలకమైన నాలుగవ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ 73 పరుగులు చేసి ఫర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఎవరూ రాణించలేకపోయారు. పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసి ఆలౌట్ అవ్వగా.. భారత్ మాత్రం 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 219/7గా ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ వెనుకబడడం ఖాయంగా కనిపిస్తోంది.

దీంతో రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా వెనుకబడటానికి గల కారణాలపై చర్చ నడుస్తోంది. ఇంగ్లండ్ మాజీ దిగ్గజ బౌలర్ సువర్ట్ బ్రాడ్ స్పందిస్తూ.. మ్యాచ్ కోసం ఇలాంటి పిచ్‌ను ఎందుకు సిద్ధం చేశారో తనకు అర్థం కావడంలేదని వ్యాఖ్యానించాడు. పగుళ్లు ఉన్న పిచ్‌లు ప్రత్యర్థి జట్లకు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డాడు. ‘‘నేను సాధారణంగా ఇంగ్లండ్ ప్రదర్శన గురించే ట్వీట్ చేస్తుంటాను. కానీ ప్రస్తుతం టీమిండియా పరిస్థితి గురించి స్పందిస్తున్నాను. భారత్‌లోని ఫ్లాట్ టెస్ట్ పిచ్‌లపై టీమిండియా అద్భుతంగా ఆడుతుంది. ముఖ్యంగా స్పిన్నర్లు వారి నైపుణ్యం ప్రదర్శించి ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేస్తుంటారు. కానీ పగుళ్లు ఉన్న రాంచీ లాంటి పిచ్‌పై ఆడితే ప్రత్యర్థి జట్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలాంటి పిచ్‌ని ఎందుకు సిద్ధం చేశారో నాకు అర్థం కాలేదు?’’ అని స్టువర్ట్ బ్రాడ్ ‘ఎక్స్’లో రాసుకొచ్చాడు.

‘‘ ఈ టెస్ట్ మ్యాచ్‌ను ఇప్పటివరకు ఎక్కువ సేపు చూడలేదు. ఇప్పుడే గమనించాను. ఇంగ్లండ్ భారీ ఆధిక్యంలో ఉంది. స్పిన్నర్లు చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. పిచ్‌పై బాగా బౌన్స్ లభిస్తోంది. పిచ్‌పై పగుళ్లు ఉన్నాయి. 100కి పైగా పరుగులు సాధించడం 350 పరుగులకి సమానం అనేలా పరిస్థితి కనిపిస్తోంది. ఈ సిరీస్‌లో టాస్ కీలకమైంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడో అది కూడా అర్థం కాలేదు’’ అని బ్రాడ్ పేర్కొన్నాడు.

More Telugu News