Maritius Flight: ఐదు గంటలపాటు రన్‌వే పైనే విమానం.. ఊపిరాడక నరకం అనుభవించిన చిన్నారులు

  • ముంబై నుంచి మారిషస్‌కు విమానం టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపం
  • విమానాన్ని రన్‌వేపై నిలిపివేసిన పైలట్.. ప్రయాణికులు కిందికి దిగేందుకు నిరాకరణ
  • ఏసీలు పనిచేయకపోవడంతో ఊపిరి తీసుకోవడంలో చిన్నారుల ఇబ్బంది
  • వారిని కిందికి దించి చికిత్స అందించిన వైనం
Passengers trapped in Mumbai Mauritius flight for 5 hours

విమానం టేకాఫ్ అవుతుండగా సాంకేతిక సమస్య ఏర్పడడంతో రన్‌వేపై విమానాన్ని అర్ధంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, ఈ క్రమంలో దాదాపు ఐదు గంటలపాటు విమానం రన్‌వే పైనే నిలిచిపోవడంతో అందులోని చిన్నారులు ఊపిరి అందక నరకం అనుభవించారు.

ఎయిర్ మారిషస్‌కు చెందిన విమానం ఈ తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో మారిషస్ వెళ్లేందుకు ముంబై విమానాశ్రయంలో టేకాఫ్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికులను దిగేందుకు అనుమంతించకపోవడంతో దాదాపు 5 గంటలపాటు అందులోనే చిక్కుకుపోయారు. ఆ సమయంలో విమానంలోని ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 

మరీ ముఖ్యంగా చిన్నారులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో వెంటనే వారిని కిందికి దించి చికిత్స అందించారు. సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయిన విమానం ప్రయాణానికి సిద్ధం కాకపోవడంతో ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఎయిర్ మారిషస్ ప్రకటించినట్టు ప్రయాణికులు చెప్పినప్పటికీ ఈ విషయంలో విమానాశ్రయ అధికారులు కానీ, విమానయాన సంస్థ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

More Telugu News