kisan rally: రైతుల నిరసన ఇక మరింత తీవ్రతరం.. కీలక ప్రకటన చేసిన సంయుక్త కిసాన్ మోర్చ

  • ఫిబ్రవరి 26న ‘ట్రాక్టర్ మార్చ్’కు పిలుపు
  • మార్చి 14న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ ‘కిసాన్ ర్యాలీ’ సభ
  • రైతుల నిరసనను మరింత ఉద్ధృతం చేస్తూ ‘సంయుక్తి కిసాన్ మోర్చ’ కీలక ప్రకటన
Tractor march on February 26 and kisan rally at Ramlila Maidan on March 14 announced by farmers

పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హమీ, రుణమాఫీ, కేసుల ఎత్తివేతతో పాటు పలు డిమాండ్లకు పరిష్కారం కోరుతూ తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం పొద్దుపోయాక కీలక ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 26న ‘ట్రాక్టర్ మార్చ్’, మార్చి 14న రాంలీలా మైదానంలో కిసాన్ ర్యాలీని నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ప్రకటించింది. రాంలీలా మైదాన్‌లో భారీ ‘కిసాన్ మహాపంచాయత్‌’ నిర్వహించనున్నామని, ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయనున్నామని వెల్లడించింది.

కాగా బుధవారం పంజాబ్-హర్యానా సరిహద్దులోని ఖానౌరీ‌లో రైతులు-పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో చనిపోయిన యువ రైతు కుటుంబానికి రూ.1 కోటి పరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం జరిగిన ఈ ఘర్షణలో పలువురు రైతులతో పాటు 12 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. దీంతో ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌ను రైతులు రెండు రోజులపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

కాగా ఎంపిక చేసిన పంటలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరతో ఐదేళ్లపాటు కొనుగోలు చేస్తామంటూ కేంద్ర మంత్రుల బృందం ఇటీవల చేసిన ప్రతిపాదనను రైతులు తిరస్కరించిన విషయం తెలిసిందే. అన్ని పంటలకు కనీస మద్దతు ధరను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కొన్ని పంటలకే మద్దతు ధర ఇస్తే మిగతా పంటలు పండించే రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీంతో తమ డిమాండ్ల సాధన కోసం రైతులు బుధవారం నుంచి ఉద్యమాన్ని పున:ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపు రైతుల నిరసనలను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో సిమెంట్, ఐరన్ బారికేడ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

More Telugu News