TCS: గతేడాది ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రాలలో 67,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన

  • 2023లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న టెక్ రంగం  
  • ఉద్యోగుల నియామకం, జీతాల ఆఫర్ల విషయంలోనూ క్షీణత నమోదు
  • 2023లో టెకీలకు ఎదురైన ఇబ్బందులపై రిపోర్ట్ వెలువరించిన ‘మింట్’
67000 jobs lost in Infosys and TCS and Wipro and Tech Mahindra in 2023

గతేడాది 2023లో టెక్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆదాయం క్షీణించడంతో వ్యయాల తగ్గింపుపై దృష్టిసారించిన కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. అనేక కంపెనీలు ఇందులో భాగమయ్యాయి. భారతీయ టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా ఈ నాలుగు కంపెనీలు పోయిన సంవత్సరం ఏకంగా 67,000 మంది ఉద్యోగులను తొలగించాయని ‘మింట్’ తాజా రిపోర్ట్ పేర్కొంది. ఇన్ఫోసిస్ 24,182 మంది ఉద్యోగులపై వేటు వేయగా విప్రో 21,875 మందిని ఇంటికి పంపించిందని రిపోర్ట్ నివేదిక తెలిపింది. ఇక టెక్ మహీంద్రా 10,669 మందిని, టీసీఎస్ 10,818 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయని వివరించింది. 

ఉద్యోగుల తొలగింపు విషయం పక్కనపెడితే, 2023లో ఐటీ కంపెనీలు పెద్దగా నియామకాలు చేపట్టలేదని మింట్ రిపోర్ట్ పేర్కొంది. అంతక్రితం ఏడాది 2022తో పోల్చితే డిసెంబర్ 2023లో ఐటీ జాబ్ ఆఫర్ల సంఖ్య 21 శాతం క్షీణించిందని రిపోర్ట్ పేర్కొంది. వ్యయాల తగ్గింపే లక్ష్యంగా కంపెనీలు మరిన్ని చర్యలకు ఉపక్రమించాయని, జాబ్ ఆఫర్ ప్యాకేజీలను కూడా తగ్గించాయని తెలిపింది. టెక్ దిగ్గజం విప్రో మొదట్లో ఫ్రెషర్లకు రూ.6.5 లక్షల శాలరీ ఆఫర్ చేయగా.. దానిని గణనీయంగా తగ్గించాలని గతేడాది ఫిబ్రవరిలో నిర్ణయించుకుందని వివరించింది. 

ప్యాకేజీ ఎక్కువ ఆశించిన ఉద్యోగులను కంపెనీ పట్టించుకోలేదని, తక్కువ శాలరీకి అంగీకరించిన ప్రెషర్లను మాత్రమే కంపెనీలోకి తీసుకుందని రిపోర్టులు ప్రస్తావించాయి. ఇక మరో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ నియామకాలను తగ్గించుకోవాలని సూచిస్తోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే శిక్షణ పొందుతున్న ఫ్రెషర్లు సరిపడా ఉండడంతో ప్రెషర్ల నియామక ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని భావిస్తున్నట్టుగా గతేడాది అక్టోబర్‌లో ఇన్ఫోసిస్ వెల్లడించిన విషయం తెలిసిందే.

కాగా 2023లో టెక్ ఉద్యోగుల తొలగింపు ఒక్క భారత్‌కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున టెకీల ఉద్యోగాలు ఊడాయి. ఎక్స్ (గతంలో ట్విటర్), మెటా, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌తో పాటు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. ప్రభావిత ఉద్యోగులు లింక్డ్‌ఇన్‌, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా తమ ఇబ్బందులను వెల్లడించిన విషయం తెలిసిందే.

More Telugu News