KCR: మేడారం జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

  • ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర
  • తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలుగా సమ్మక్క, సారలమ్మలను పేర్కొన్న కేసీఆర్
  • భక్తులకు అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించాలని ప్రభుత్వానికి సూచన 
KCR congratulated on the occasion of Medaram Jatara

సుప్రసిద్ధ మేడారం జాతర కోలాహలంగా సాగుతోంది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే ఈ మహాజాతరకు భక్తులు దేశంలోని అనేక ప్రాంతాలనుంచి తండోపతండాలుగా తరలివస్తున్నారు. 

ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, సబ్బండ వర్గాలకు ఇలవేల్పులుగా సమ్మక్క-సారలమ్మ పూజలు అందుకుంటున్నారని కొనియాడారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిచెందిందని వివరించారు. 

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొనసాగిన ఆత్మగౌరవ పోరాటంలో సమ్మక్క-సారలమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. సమైక్య పాలకుల ఏలుబడిలో ఒకప్పుడు కల్లోలిత ప్రాంతంగా అలజడులకు గురైన గోదావరి లోయ పరీవాహక ప్రాంతం నేడు సాగునీటి జీవజలంతో సస్యశ్యామలమై ప్రజల జీవితాల్లో సాంత్వన నింపిందని తెలిపారు. 

దేశం నలుమూలల నుంచి అడవితల్లుల దర్శనార్థం వచ్చే కోట్లాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వనదేవతలను ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News