Telangana: థాంక్స్ టు కేటీఆర్... 18 ఏళ్లు దుబాయ్ జైల్లో మగ్గి, ఎట్టకేలకు తిరిగొచ్చిన తెలంగాణ వాసులు

  • ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తెలంగాణ వాసులు
  • ఓ నేపాలీ గూర్ఖా హత్య కేసులో 25 ఏళ్ల జైలుశిక్ష
  • కేటీఆర్ ప్రయత్నాలతో తగ్గిన శిక్షాకాలం
  • మెర్సీ పిటిషన్ ను ఆమోదించిన యూఏఈ ప్రభుత్వం
Telagana men returned from Dubai after spent 18 years in prison

తెలంగాణకు చెందిన శివరాత్రి మల్లేశ్, శివరాత్రి రవి, దుండుగుల లక్ష్మణ్, శివరాత్రి హన్మంతు, వెంకటేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ బహదూర్ సింగ్ అనే నేపాలీ గూర్ఖాను హత్య చేసిన కేసులో ఈ ఐదుగురికి పాతికేళ్ల జైలు శిక్ష పడింది. 

అయితే, కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో వీరి శిక్ష తగ్గింపునకు కృషి చేశారు. గతేడాది సెప్టెంబరులో దుబాయ్ లో పర్యటించిన సందర్భంగా కేటీఆర్ అక్కడి ప్రభుత్వానికి దీనిపై విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రయత్నాల ఫలితంగా వారి క్షమాభిక్ష పిటిషన్ కు యూఏఈ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ హత్య కేసులో శిక్ష పడిన వారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు. సిరిసిల్ల నియోజకవర్గానికి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో, దుబాయ్ లో 18 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన శివరాత్రి మల్లేశ్, అతడి సోదరుడు శివరాత్రి రవి నేడు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా, అక్కడ తీవ్ర భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. కుటుంబ సభ్యులను కలుసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. 

కాగా, దుబాయ్ నుంచి దుండుగుల లక్ష్మణ్ రెండు నెలల క్రితమే తెలంగాణకు తిరిగి రాగా, శివరాత్రి హన్మంతు రెండ్రోజుల కిందట సొంతగడ్డకు చేరుకున్నాడు. హత్య కేసులో శిక్ష అనుభవించిన ఐదో వ్యక్తి వెంకటేశ్ వచ్చే నెలలో దుబాయ్ జైలు నుంచి విడుదల కానున్నాడు. వీరు దుబాయ్ నుంచి తెలంగాణ తిరిగొచ్చేందుకు కేటీఆర్ విమాన టికెట్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

2011లో కేటీఆర్ నేపాల్ కు వ్యక్తిగత పర్యటనపై వెళ్లి, దుబాయ్ లో హత్యకు గురైన గూర్ఖా బహదూర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి రూ.15 లక్షల పరిహారం కూడా అందించారు. ఈ క్రమంలోనే గూర్ఖా కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పిటిషన్ పై సంతకం చేసినట్టు తెలుస్తోంది. 

అయితే, ఈ మెర్సీ పిటిషన్ ను యూఏఈ ప్రభుత్వం తొలుత తిరస్కరించింది. దాంతో కేటీఆర్ దుబాయ్ లోని భారత కాన్సుల్ జనరల్ వర్గాలు, కేసును వాదిస్తున్న అరబ్ న్యాయవాది, ప్రభుత్వ అధికారుల ద్వారా ఈ వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే వచ్చారు. 

2023 సెప్టెంబరులో దుబాయ్ పర్యటనకు వెళ్లినప్పుడు ప్రత్యేకించి ఈ కేసు అంశంలో క్షమాభిక్ష పిటిషన్ ను యూఏఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ ఐదుగురు వ్యక్తులు ఇప్పటికే చాలాకాలం జైల్లో గడిపారని, వారు సత్ప్రవర్తనతో మెలుగుతున్నారని జైలు అధికారులు కూడా  సర్టిఫికెట్ ఇచ్చారని యూఏఈ ప్రభుత్వానికి వివరించారు. ఈ నేపథ్యంలో, కేటీఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యూఏఈ ప్రభుత్వం తెలంగాణ వ్యక్తుల జైలు శిక్ష కాలాన్ని తగ్గించింది.

More Telugu News