Chandrababu: వితంతు మహిళ కంటిచూపు పొగొట్టిన ఘటన తీవ్రంగా కలచివేసింది: చంద్రబాబు

Chandrbabu gets angry over YSRCP
  • చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వితంతు మహిళపై దాడి
  • వైసీపీ మూకలకు అడ్డే లేకుండా పోయిందన్న చంద్రబాబు
  • ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తున్నాడని ఆగ్రహం 
వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతియుగంలోకి వెళ్లిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. అసమ్మతి గళాలపై దాడులను, అరాచకాన్ని ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తున్నాడని మండిపడ్డారు. 

వైసీపీ రౌడీ మూకలకు అడ్డే లేకుండా పోయిందని, టీడీపీ నేతలకు తన సమస్య చెప్పుకున్న పాపానికి ఒక వితంతు మహిళపై దాడి చేసి కంటి చూపు పోగొట్టారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. భర్త లేకపోయినా, దివ్యాంగుడైన కొడుకుతో జీవితాన్ని గడుపుతున్న ఒక పేద మహిళపై ఇంతటి దాష్టీకమా? అని ప్రశ్నించారు. 

ప్రతి పక్షాలు, మీడియాతో పాటు సామాన్య ప్రజలపైనా దాడులు నిత్యకృత్యంగా మారాయని పేర్కొన్నారు. రాష్ట్రం ఎటుపోతోందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో హంసవేణి కంటిచూపు కోల్పోయిన ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
Chandrababu
TDP
Jagan
YSRCP

More Telugu News