Pakistan: పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు.. పీపీపీ-పీఎంఎల్(ఎన్) పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం

  • పాకిస్థాన్ ప్రధానమంత్రిగా పీఎంఎల్(ఎన్) పార్టీ చీఫ్ షెహబాజ్ షరీఫ్ ఖరారు
  • మరోసారి రాష్ట్రపతిగా పీపీపీ కో-చైర్మన్‌గా ఉన్న ఆసిఫ్ జర్దారీ
  • సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై సంయుక్త ప్రకటన విడుదల చేసిన ఇరు పార్టీలు
Formation of coalition government in Pakistan as Agreement reached between PPP and PMLN parties

దాయాది దేశం పాకిస్థాన్‌లో నూతన ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. రోజుల తరబడి పలు దఫాలుగా జరిగిన చర్చలు, సంప్రదింపుల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ), పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్-ఎన్) పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ఇరు పార్టీలు మీడియాకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. పీఎంఎల్(ఎన్) పార్టీ చీఫ్ షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రధానమంత్రిగా, పీపీపీ కో-చైర్మన్‌గా ఉన్న ఆసిఫ్ జర్దారీ మరోసారి రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారని పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ వెల్లడించారు.

ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని పీపీపీ, పీఎంఎల్‌(ఎన్‌) సాధించాయని బిలావల్ భుట్టో జర్దారీ తెలిపారు. పదవుల పంపకంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయని ఆయన వివరించారు. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పీటీఐ (పాకిస్థాన్‌ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్), సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ (SIC) పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఉందని నేషనల్ అసెంబ్లీలో నిరూపించుకోలేకపోయాయని అన్నారు. కాగా సమర్థవంతమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్న విశ్వాసం ఉందని ఆసిఫ్ జర్దారీ అన్నారు.

కాగా ఫిబ్రవరి 8న జరిగిన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ అభ్యర్థులు 93 సీట్లు, పీఎంఎల్‌(ఎన్‌) పార్టీ -75, పీపీపీ 54 స్థానాలు గెలుచుకున్నాయి. ఇక ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్థాన్‌ పార్టీ 17 స్థానాల్లో గెలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు 169 సీట్ల సాధారణ మెజారిటీ అవసరం ఉండగా.. పీపీపీ-పీఎంఎల్(ఎల్) పార్టీలు ఇతర చిన్న పార్టీలతో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి.

More Telugu News