Marriage: నాకొక శ్రీమతి కావాలి.. ఆటోకు హోర్డింగ్ తగిలించి మరీ వెతుకులాట!

  • మధ్యప్రదేశ్‌లోని దామోలో వధువు కోసం ఆటో డ్రైవర్ ప్రకటన
  • తన పూర్తి వివరాలతో ఆటోకు హోర్డింగ్
  • కులమతాలతో తనకు సంబంధం లేదని ప్రకటన
  • ఎవరొచ్చినా బంగారంలా చూసుకుంటానన్న దీపేంద్ర
Need A Wife Madhya Pradesh Auto Driver Seeks Bride For Himself

ఏ వయసులోనైనా ఇండియాలో పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ.. అని గతంలో చెబుతుండేవారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అమ్మాయిల సంగతేమో కానీ, అబ్బాయిలు మాత్రం పెళ్లి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అందుకు ఇది మరో ఉదాహరణ. మధ్యప్రదేశ్‌లోని దామోకు చెందిన 29 ఏళ్ల దీపేంద్ర రాథోడ్ పెళ్లి కోసం పడరాన్ని పాట్లు పడుతున్నాడు. ఆటో డ్రైవర్ అయిన దీపేంద్ర పెళ్లికి తనకో పిల్ల కావాలంటూ తాను నడిపే ఆటోకే పెద్ద హోర్డింగ్ తగిలించాడు. దానిపై తన పూర్తి వివరాలను రాసుకొచ్చాడు. 

పెళ్లి కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న దీపేంద్ర కలలు ఫలించడం లేదు. సమాజంలో ఆడపిల్లల నిష్పత్తి పడిపోతుండడంతో అతడికి అమ్మాయి దొరకడం కష్టమైంది. ఇలాగైతే తాను ఎప్పటికీ పెళ్లికాకుండా బ్రహ్మచారిలా మిగిలిపోతానని భయపడిన దీపేంద్ర ఏకంగా తన ఆటోకే హోర్డింగ్ తగిలించి వెతుకులాట మొదలుపెట్టాడు. కులమతాలతో తనకు సంబంధం లేదని, ఎవరైనా సరే పెళ్లి ప్రతిపాదనతో తనను కలవొచ్చని ప్రకటనలో పేర్కొన్నాడు. ఓ మ్యారేజ్ గ్రూప్‌లో చేరినప్పటికీ అమ్మాయి దొరక్కపోవడంతో చివరి ప్రయత్నంగా ఈ హోర్డింగ్ ఏర్పాటు చేశాడు. అంతేకాదు, సిటీ బయటి వ్యక్తినైనా పెళ్లాడేందుకు రెడీ అని దీపేంద్ర చెప్పుకొచ్చాడు.

ఆ హోర్డింగ్‌లో దీపేంద్ర తన వయసు 29 ఏళ్లని చెబుతూ జన్మదినం, ఎత్తు, బ్లడ్‌గ్రూప్, గోత్రం, చదువుకు సంబంధించిన వివరాలను పేర్కొన్నాడు. దీపేంద్ర చేసిన ఈ హోర్డింగ్ ప్లాన్‌కు అతడి తల్లిదండ్రులు కూడా మద్దతుగా నిలవడం విశేషం. ‘‘నా తల్లిదండ్రులు నిత్యం పూజల్లోనే గడుపుతుంటారు. దీంతో తనకు పెళ్లి కూతుర్ని వెతికే సమయం వారికి ఉండడం లేదు. అందుకే ఈ ఏర్పాట్లు’’ అని చెప్పుకొచ్చాడు. ఈ-రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషించే దీపేంద్ర.. తన భార్య ఎవరైనా సరే.. ఆమెను బంగారంలా చూసుకుంటానని చెప్పుకొచ్చాడు. అతడి ప్రయత్నాలు ఫలించి ఓ ఇంటివాడు కావాలని మనమూ కోరుకుందాం.

More Telugu News