Revanth Reddy: ఆ సీఎంల అనుభవసారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

CM Revanth reddy talks about master plan for development of Entire Telangana
  • ఆదివారం నానక్‌రాంగూడలో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం
  • యావత్ తెలంగాణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌పై యోచిస్తున్నట్టు వెల్లడి
  • రాష్ట్రాన్ని అర్బన్, పెరి అర్బన్, రూరల్ భాగాలుగా విభజించి అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడి
యావత్ తెలంగాణలో వేగవంతమైన అభివృద్ధి కోసం ఒక బృహత్ ప్రణాళిక ఉండాలనేది తమ ప్రభుత్వ విధానమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ 2050-మెగా మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో క్రెడాయ్ ఇచ్చిన రూ.17 కోట్ల నిధులతో నిర్మించిన అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ నూతన భవనాన్ని సీఎం ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం రూ.1.5 కోట్లతో నిర్మించిన సనత్‌నగర్ అగ్నిమాపక కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. 

అనంతరం సీఎం మాట్లాడుతూ..ఓఆర్ఆర్ లోపల వరకూ అర్బన్ తెలంగాణ, ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకూ పెరి అర్బన్ తెలంగాణ, ఆర్ఆర్ఆర్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకూ రూరల్ తెలంగాణగా విడగొట్టి అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. చైనాలో ప్రపంచంలో ఎలాంటి వస్తువు కావాలన్నా దొరికేలా సిటీలను అభివృద్ధి చేశారన్నారు. ఇక్కడా అలాగే చేయాలనుకుంటున్నట్టు సీఎం చెప్పారు. మౌలిక వసతుల రంగాన్ని ప్రోత్సహించాలనేదే తమ విధానమని వివరించారు. ఫార్మా సిటీని తరలిస్తున్నారని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మా సిటీ కాకుండా ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ప్రజాప్రయోజనాల కోసం మెట్రోను నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రతిపాదించినట్టు చెప్పారు. మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

ఒకప్పటి మతకల్లోల పరిస్థితుల నుంచి హైదరాబాద్‌ను అప్పటి ప్రభుత్వాలు బయటకు తీసుకొచ్చాయన్నారు. సీఎంలుగా పనిచేసిన చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్‌ల రాజకీయం, ఆలోచనా విధానం ఎలా ఉన్నా, హైదరాబాద్ అభివృద్ధి విషయంలో అంతకుముందు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించారన్నారు. ఈ సంప్రదాయం ఇక ముందూ కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  వారి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు.
Revanth Reddy
Telangana
Congress
BRS
Telugudesam

More Telugu News