Komatireddy Raj Gopal Reddy: పేరు కోసమో... డబ్బు కోసమో కేసీఆర్ ప్రభుత్వం భారీ నిర్మాణాలు చేపట్టింది: రాజగోపాల్ రెడ్డి

  • మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన ద్వారా ప్రజలకు చాలా నిజాలు తెలిశాయని వ్యాఖ్య
  • దోపిడీ కోసం, కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని ఆరోపణ
  • గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరాన్ని నిర్మించారని మండిపాటు
  • కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులకు కూడా మాట్లాడే అధికారం ఉండేది కాదని విమర్శ
Rajagopal Reddy blames kcr government for heavy projects

పేరు కోసమో... డబ్బు కోసమో గానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి ప్రభుత్వం ఉన్నప్పుడు భారీ నిర్మాణాలు చేపట్టారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. నీటి పారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ అంశంపై చర్చ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన ద్వారా ప్రజలకు చాలా నిజాలు తెలిశాయన్నారు. దోపిడీ కోసం, కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని ఆరోపించారు.

గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరాన్ని నిర్మించారని మండిపడ్డారు. కేసీఆర్ పేరు కోసం లేదా డబ్బు కోసమే పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి కాళేశ్వరంతో పాటు సచివాలయం, యాదాద్రిని నిర్మించారని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులకు కూడా మాట్లాడే అధికారం ఉండేది కాదన్నారు. 

ఖర్చు, ప్రయోజనాలపై చర్చ జరగాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రాజెక్టుల ఖర్చు, ప్రయోజనాలపై కచ్చితంగా చర్చ జరగాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రావిటీ ప్రాజెక్టుల ద్వారా మాత్రమే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బిల్లే ప్రతి సంవత్సరానికి రూ.10,700 కోట్లు అవుతుందన్నారు.

More Telugu News