Kaleshwaram Project: కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ కావాలని హైకోర్టును కోరాం.. కానీ!: మంత్రి శ్రీధర్ బాబు

  • సిట్టింగ్ జడ్జితో విచారణ అడిగితే... జడ్జిలు తక్కువగా ఉన్నారని హైకోర్టు నుంచి సమాధానం వచ్చిందన్న మంత్రి
  • కాంగ్రెస్ మేనిఫెస్టోలో జ్యూడిషియల్ విచారణ అని మాత్రమే చెప్పామని వెల్లడి
  • సీబీఐ, ఈడీ, విజిలెన్స్ విచారణకు తమకు అభ్యంతరం లేదన్న శ్రీధర్ బాబు
  • కేంద్ర దర్యాఫ్తు సంస్థలతో విచారణ జరిపితే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటవుతాయేమోననే అనుమానం వ్యక్తం చేసిన మంత్రి
Minister Sridhar Babu ready to enquiry with sitting judge on kaleswaram

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తాము హైకోర్టును కోరామని మంత్రి శ్రీధర్ బాబు శాసనసభలో శనివారం తెలిపారు. నీటి పారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ అంశంపై చర్చ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడారు. సిట్టింగ్ జడ్జితో విచారణకు అడిగినప్పటికీ... జడ్జిలు తక్కువగా ఉన్నారని హైకోర్టు నుంచి సమాధానం వచ్చిందని తెలిపారు. హైకోర్టుకు మరోసారి లేఖ రాస్తామన్నారు. తమ మేనిఫెస్టోలో ఎక్కడా కూడా సీబీఐ విచారణ అని చెప్పలేదని... జ్యూడిషియల్ విచారణ అని మాత్రమే చెప్పామని గుర్తు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు కూడా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. సీబీఐ ఒకటే కాదు... ఈడీ, విజిలెన్స్ కూడా ఉన్నాయన్నారు. కానీ కేంద్ర దర్యాఫ్తు సంస్థలతో విచారణ చేయిస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అవుతాయనే అనుమానం ఉందని వ్యాఖ్యానించారు. గతంలోనూ సిట్టింగ్ జడ్జితో విచారణలు జరిగాయన్నారు. సీబీఐతో విచారణ చేయించినా తమకు అభ్యంతరం లేదన్నారు.

కేసీఆర్ సభకు రావాలి: పొంగులేటి

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు రావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హితవు పలికారు. ప్రాజెక్టులను త్వరగా కట్టాలనే ఆత్రుత తప్ప నాణ్యత గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించలేదని ఆరోపించారు. మేడిగడ్డ కూలిపోయింది బీఆర్ఎస్ హయాంలోనే అనే విషయం తెలుసుకోవాలన్నారు.

More Telugu News