Paytm Payments Banks: మార్చి 15 తర్వాత పేటీఎం క్యూఆర్ కోడ్‌లు, సౌండ్ బాక్సులు పనిచేస్తాయా?

  • నగదు వినియోగం, విత్‌డ్రాకు ఉపయోగపడనున్న 15 రోజుల గడువు
  • గడువు తర్వాత కూడా యథావిధిగా పనిచేయనున్న క్యూఆర్ కోడ్‌లు, సౌండ్ బాక్సులు
  • పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షల గడువుని మార్చి 15 వరకు పెంచడంతో కస్టమర్లకు పలు ప్రయోజనాలు
Paytm Banks Lifeline Extended Till March 15 and how it will help Customers

మార్గదర్శకాలను ఉల్లంఘించి విదేశీ లావాదేవీలు నిర్వహించిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29 నుంచి సేవలను నిలిపివేయాలంటూ గతంలో ఆదేశించిన ఆర్బీఐ.. కాస్త ఉపశమనాన్ని కల్పిస్తూ మార్చి 15 వరకు గడువుని పెంచింది. ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన వెలువరించింది. కార్యకలాపాల నిలిపివేతకు గడువుని పొడగించడంతో కస్టమర్లకు పలు ప్రయోజనాలు కలగనున్నాయి.

పేటీఎం పేమెంట్ బ్యాంక్ తన కార్యకలాపాలను సజావుగా కొనసాగించడానికి వీలుగా నూతన వ్యాపార భాగస్వామిని ఏర్పాటు చేసుకునేందుకు ఆర్బీఐ నిర్ణయం ఉపయోగపడనుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్న కస్టమర్లకు గడువు పెంపు ఉపశమనం కల్పించనుందని ఆర్బీఐ పేర్కొంది. వ్యాపారులకు నిరంతరాయ లావాదేవీల సౌకర్యాన్ని కల్పించడమే లక్ష్యంగా పేటీఎం పేమెంట్స్ మాతృసంస్థ పేటీఎం ఇప్పటికే తన అకౌంట్లను కొత్త బ్యాంక్‌కి మార్చేందుకు సిద్ధమైంది. మరోవైపు పేటీఎం క్యూఆర్ కోడ్‌లు, సౌండ్‌బాక్స్‌లు, కార్డ్ మెషీన్‌లు మార్చి 15 తర్వాత కూడా సజావుగా పనిచేస్తాయని యూజర్లకు పేటీఎం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.

ఆర్బీఐ ఉపశమనం కస్టమర్లకు ఇలా ఉపయోగమంటే..

  • పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఉన్న నగదును కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. ఖాతాలోని సొమ్మును ఉపసంహరించుకోవచ్చు లేదా  ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
  • మార్చి 15, 2024 తర్వాత కొత్తగా ఎలాంటి డిపాజిట్లను స్వీకరించరు. అయితే పార్టనర్ బ్యాంక్ నుంచి జమ అవ్వాల్సిన వడ్డీ, క్యాష్‌బ్యాక్, స్వీప్-ఇన్‌లు, రీఫండ్‌ల విషయంలో కస్టమర్లకు మినహాయింపు ఉంటుంది. 
  • మార్చి 15 తర్వాత యూపీఐ/ఐఎంపీఎస్ విధానంలో కస్టమర్‌లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయడానికి వీలుండదు. అయితే విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంటుంది.
  • మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో శాలరీలు జమకావు. కస్టమర్లు వేరే బ్యాంకుతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ సూచించింది.
  • పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో సబ్సిడీలు, ప్రత్యక్ష ప్రయోజన నగదు బదిలీలు జరగవు.
  • ఇక మార్చి 15 తర్వాత డిపాజిట్‌లు, క్రెడిట్‌లకు అనుమతి ఉండదు. సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాలెన్స్‌ ఉన్నంత వరకు ఫాస్టాగ్‌లను ఉపయోగించవచ్చు. కానీ ఎలాంటి టాప్-అప్‌లకు అవకాశం ఉండదు.

More Telugu News