Ben Duckett: టీమిండియా బౌలింగ్ ను చీల్చిచెండాడిన ఇంగ్లండ్ ఓపెనర్... ముగిసిన రెండో రోజు ఆట

  • రాజ్ కోట్ లో టీమిండియా-ఇంగ్లండ్ మూడో టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు టీమిండియా ఆలౌట్
  • నేడు ఆట చివరికి 2 వికెట్లకు 207 పరుగులు చేసిన ఇంగ్లండ్
  • వన్డే తరహాలో దూకుడుగా ఆడిన పర్యాటక జట్టు
Ben Duckett hammers Team India bowlers in Raj Kot test day 2

టీమిండియా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ్టి ఆటలో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌట్ కాగా... ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ విధ్వంసకర సెంచరీతో ఇంగ్లండ్ పటిష్ఠ స్థితిలో నిలిచింది. 

మరో ఓపెనర్ జాక్ క్రాలీ 15 పరుగులకే అశ్విన్ బౌలింగ్ లో వెనుదిరిగినా... బెన్ డకెట్ టీమిండియా బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. డకెట్ 118 బంతుల్లోనే 133 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 21 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయంటే ఊచకోత ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అతడింకా క్రీజులోనే ఉండడం టీమిండియాను ఆందోళనకు గురిచేసే అంశం. 

రెండో రోజు ఆట చివరికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. వైట్ బాల్ క్రికెట్ తరహాలో దూకుడుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవలం 35 ఓవర్లలోనే ఈ పరుగులు చేసింది. బెన్ డకెట్, జో రూట్ (9 బ్యాటింగ్) బరిలో ఉన్నారు. ఓలీ పోప్ 39 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 

టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లండ్ ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది.

More Telugu News