Congress Party: కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల సీజ్.. గంట తర్వాత రిలీజ్ చేసిన ఆదాయపన్ను శాఖ

  • రూ.210 కోట్ల పన్ను కట్టాలంటూ నోటీసుల జారీ
  • రాజకీయ ప్రేరేపితమని మండిపడుతున్న కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మాకెన్
  • లోక్ సభ ఎన్నికలకు సిద్ధం కాకుండా అడ్డుకోవడానికేనని ఆరోపణ
  • ఇన్ కం ట్యాక్స్ ట్రిబ్యులేట్ ను ఆశ్రయించిన కాంగ్రెస్ పార్టీ
No Money To Pay Electricity Bills Says Congress Party As Bank Accounts Frozen

దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కరెంట్ బిల్ కట్టేందుకు కూడా డబ్బుల్లేక విలవిలలాడింది. స్వయంగా ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. పార్టీకి చెందిన నాలుగు బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను శాఖ సీజ్ చేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మాకెన్ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేయించిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల అనధికారిక ఆదేశాలతోనే ఆదాయపన్ను శాఖ అధికారులు తమ పార్టీ ఖాతాలను సీజ్ చేశారని విమర్శిస్తున్నారు. ఈ విషయంపై తాము ఇన్ కం ట్యాక్స్ ట్రిబ్యులేట్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. దీంతో దాదాపు గంట తర్వాత కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను శాఖ రిలీజ్ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలు యథావిధిగా జరుగుతున్నాయని సమాచారం.

 వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా జరిగిన చర్య ఇదని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా అంతరించిపోయిందని, తమ పార్టీ మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో బీజేపీ ఇలాంటి నియంతృత్వ పోకడలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ తీరుపై తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, న్యాయ పోరాటం ద్వారా తమ హక్కులను సాధించుకుంటామని చెప్పారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షాలతో వ్యవహరిస్తున్న తీరును మీడియా సాయంతో ప్రజల్లోకి తీసుకెళతామని మాకెన్ వివరించారు. బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడంతో ఆఫీసు కరెంట్ బిల్లులు, ఉద్యోగుల జీతాలు చెల్లించే పరిస్థితి లేదని మాకెన్ తెలిపారు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘న్యాయ్ యాత్ర’ పైనా దీని ప్రభావం పడుతుందని చెప్పారు. 

ఆదాయపన్ను శాఖ వాదన ఇదే.. 
ఆదాయపన్ను చెల్లించకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు ఇన్ కంట్యాక్స్ డిపార్ట్ మెంట్ వివరించింది. రూ. 210 కోట్ల పన్ను పన్ను వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది. సకాలంలో పన్ను చెల్లించకపోవడంతో నిబంధనల ప్రకారమే పార్టీ ఖాతాలను సీజ్ చేసినట్లు పేర్కొంది.

More Telugu News