Talasani: ఎల్లుండి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఇన్సురెన్స్ పత్రాల పంపిణీ: తలసాని

  • ఈ నెల 17న సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు వెల్లడి
  • నాయకులు, కార్యకర్తలు ఎవరి ప్రాంతాల్లో వారు వేడుకలు నిర్వహించుకోవాలని సూచన
  • తెలంగాణవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిపేలా ఏర్పాట్లు చేస్తామన్న తలసాని
talasani on kcr birth day celebrations

పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న అనేక సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వికలాంగులకు వీల్ చైర్ల పంపిణీ, ఆటో డ్రైవర్లకు ఇన్సురెన్స్ పత్రాల పంపిణీ, పేషేంట్లకు పండ్ల పంపిణీ తదితర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

హైదరాబాద్ కార్యాలయంలో శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తలసాని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, క్యాడర్‌ సహా సీనియర్ నేతలందరూ జన్మదిన వేడుకల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్రం, నగరం నలుమూలల నుంచి కార్యకర్తలు తమ తమ ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించి ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకోవాలన్నారు. ఆ రోజున తెలంగాణవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు జరిపేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పేషేంట్స్‌కు పండ్ల పంపిణీ, వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

70 వ జన్మదినం సందర్భంగా ప్రముఖుల సమక్షంలో 70 కిలోల భారీ కేక్‌ను కట్ చేస్తామన్నారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యంలో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా ప్రదర్శిస్తామన్నారు. 'తానే ఒక చరిత్ర' అనే పేరుతో ఉండే ఈ డాక్యుమెంటరీలో ఆయన చిన్ననాటి నుంచి ఛలో నల్గొండ సభ వరకు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన జీవితంపై ముప్పై నిమిషాలు ఉంటుందన్నారు.

More Telugu News