Sant Sevalal Maharaj: అన్ని తండాల్లోనూ పాఠశాలలు నిర్మిస్తాం.. ఏ సమస్య ఉన్నా చెప్పండి.. బంజారాలతో ముఖ్యమంత్రి రేవంత్

  • సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా బంజారాలతో సమావేశం
  • బంజారా సోదరులతో సమావేశమంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలిసినంత ఆనందంగా ఉందన్న సీఎం
  • బంజారాలను ఎస్టీల్లో చేర్చింది ఇందిరాగాంధీయేనని గుర్తుచేసిన రేవంత్‌రెడ్డి
  • గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాల్లో బీటీ రోడ్లు వేస్తామని స్పష్టీకరణ
will build schools in all banjara tandas says CM Revanth Reddy

రాష్ట్రంలోని అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బీటీ రోడ్లువేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని, విద్యుత్, తాగునీరు సహా ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బంజారా సోదరులతో సమావేశమంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలిసినంత ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చినట్టు గుర్తించారు.  మీ ఆశీర్వాదంతోనే ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలీడేగా ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఉత్సవాల నిర్వహణకు రూ. 2 కోట్లు విడుదల చేస్తున్నట్టు చెబుతూ తక్షణం అందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గృహాల్లో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చదువుకుంటేనే సమాజంలో గౌరవం ఉంటుందని, సంత్ సేవాలాల్ మార్గంలో నడవాలని సూచించారు. మీ అభ్యున్నతికే ఈ ప్రభుత్వం పాటుపడుతుందని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని రేవంత్ కోరారు.

More Telugu News