BCCI Jay Shah: రంజీ ట్రోఫీకి క్రీడాకారుల గైర్హాజరు.. బీసీసీఐ సెక్రెటరీ జై షా కీలక వ్యాఖ్య!

  • రంజీ మ్యాచుల్లో కనిపించని ఇషాన్ కిషన్, దీపక్ ఛహార్, క్రునాల్ పాండ్యా
  • దేశవాళీ క్రికెట్‌కు క్రీడాకారులు దూరంగా ఉండటంపై బీసీసీఐ సెక్రెటరీ ఆందోళన
  • త్వరలో వారందరికీ లేఖలు రాస్తానని వెల్లడి
  • ఫిట్‌గా ఉన్న యువ క్రీడాకారులందరూ రంజీలో పాల్గొనాల్సిందేనని స్పష్టీకరణ
Jay Shah makes big statement on players not participating in Ranji Trophy

రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు క్రీడాకారులు గైర్హాజరవడంపై బీసీసీఐ సెక్రెటరీ జై షా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పెద్ద సమస్యేనని వ్యాఖ్యానించిన ఆయన.. త్వరలో తాను టోర్నమెంట్లో కానరాని ప్లేయర్లకు లేఖ రాస్తానని చెప్పారు. ప్రస్తుతం జాతీయ జట్టులో లేని ఇషాన్ కిషన్, దీపక్ ఛహార్, కృనాల్ పాండ్యా వంటి వారు దేశవాళీ టోర్నీకీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. 

దేశవాళీ మ్యాచులకు జట్టు సభ్యులు గైర్హాజరవడం పెద్ద సమస్యేనని షా అన్నారు. ‘‘ఇది పెద్ద ఇష్యూనే. వీళ్లందరికీ నేను లేఖలు రాస్తాను. కెప్టెన్ లేదా కోచ్ క్రీడాకారులను రంజీలో ఆడమన్నప్పుడు ప్లేయర్స్ ఆ టోర్నీలో పాల్గొనాలి. జాతీయ క్రికెట్ అకాడమీలో లేని వారందరికీ ఇది వర్తిస్తుంది. అయితే, గాయాలపాలైన ప్లేయర్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. రెడ్ బాల్ టోర్నీలో పాల్గొని గాయాలు ముదిరేలా చేసుకోకూడదు. వైట్ బాల్ టోర్నీ ఛాన్సులు తగ్గకూడదు. కానీ, ఫిట్‌గా ఉన్న యువ ప్లేయర్లందరికీ ఇది వర్తిస్తుంది’’ అని జై షా తేల్చి చెప్పారు. 

దక్షిణాఫ్రికా టూర్‌కు దూరమైన ఇషాన్ కిషన్ ఆ తరువాత టీం ఇండియాలో కనిపించలేదు. ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్‌తో సిరీస్‌లకూ అతడు ఎంపికకాలేదు. మళ్లీ జట్టులోకి వచ్చేందుకు అతడు కొంత దేశవాళీ క్రికెట్ ఆడాలని కోచ్ ద్రావిడ్ ఇటీవల ఓసారి వ్యాఖ్యానించారు. అయితే, జై షా ఇషాన్ కిషన్‌ను దృష్టిలో పెట్టుకునే తాజా వ్యాఖ్యలు చేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘‘అతడో యువ క్రీడాకారుడు. కాబట్టి అతని పేరు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అయితే, ఇకపై క్రీడాకారులందరూ కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే’’ అని జై షా పేర్కొన్నారు.

More Telugu News