muralidhar rao: సీబీఐ విచారణను రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో కలిపేశారు: బీజేపీ నేత మురళీధరరావు చురక

  • దోపిడీకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చెప్పారన్న మురళీధరరావు
  • ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఉన్నప్పటికీ దర్యాఫ్తు చేయడం లేదని ఆరోపణ
  • దొంగను జైల్లో పెట్టాల్సిన బాధ్యతను రేవంత్ రెడ్డికి ప్రజలు ఇస్తే ఏం చేస్తున్నారని ప్రశ్న
Muralidhar Rao satire on kaleswaram issue

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని గతంలో డిమాండ్ చేసిన నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ సీబీఐ విచారణను కాళేశ్వరంలో కలిపేశారని బీజేపీ నేత మురళీధర రావు ఎద్దేవా చేశారు. దోపిడీకి సంబంధించిన ఆధారాలు పూర్తిగా తన వద్ద ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడిగా పలుమార్లు చెప్పిన ముఖ్యమంత్రి... ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఉన్నప్పటికీ దర్యాఫ్తు చేయడం లేదని ఆరోపించారు.

దొంగలను జైల్లో పెట్టాల్సిన బాధ్యతను ప్రజలు రేవంత్ రెడ్డికి అప్పగించారని... అయినప్పటికీ మేడిగడ్డకు టూరిస్ట్ బస్సులను తీసుకొని వెళ్లడం ఏమిటి? అని ప్రశ్నించారు. పోలీస్ జీపు వెళ్లి గత ప్రభుత్వంలోని దోషులను ఎందుకు పట్టుకోవడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి దృష్టి మరల్చడం కోసం టైమ్ పాస్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ భాగస్వాములే అన్నారు.

రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులు ప్రధాని మోదీ చేసినవి కావని... విభజన చట్టంలో ఉన్నవే అన్నారు. కేఆర్ఎంబీకి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని తెలిపారు. నదీ జలాల పంపిణీ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండదని, ట్రైబ్యునల్‌కు మాత్రమే అధికారం ఉందన్నారు. డిపాజిట్ తెచ్చుకోవడం కోసం, ఉనికి కోసం మాత్రమే కేసీఆర్, కాంగ్రెస్ దొంగ నాటకాలు చేయిస్తున్నాయని విమర్శించారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తానని కేసీఆర్ చెప్పారని, కానీ దానిని పక్కన పెట్టారని విమర్శించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు.

More Telugu News