Kadiam Srihari: కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి దుర్భాషలాడారు: కడియం శ్రీహరి ఆగ్రహం

  • మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా కంచెలు వేశారని ఆరోపణ
  • అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చను పక్కదారి పట్టించారని వ్యాఖ్య
  • కాంగ్రెస్ ఏ రకమైన పాలనను అందిస్తుందో ప్రజలంతా చూస్తున్నారన్న కడియం
Kadiyam Srihari fires at Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను దుర్భాషలాడారని మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ బీజేపీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. బీఆర్ఎస్ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వలేదన్నారు. మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా కంచెలు వేశారని ఆరోపించారు. దీనిని బట్టే రాష్ట్రంలో ప్రజాపాలన ఎలా ఉందో అర్థమవుతోందని విమర్శించారు. 

అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చను పక్కదారి పట్టించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సభలో మాట్లాడారన్నారు. ప్రతిపక్షంపై దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. స్పీకర్ అసెంబ్లీలో మాట్లాడేందుకు తమకు అవకాశమివ్వలేదన్నారు. శాసన సభలో తమను తిట్టించే కార్యక్రమాన్ని పెట్టారని ఆరోపించారు. స్పీకర్ గారిని మైక్ అడిగినా ఇవ్వలేదన్నారు. కనీసం మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడే అవకాశమివ్వలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు.

ప్రతిపక్షంపై దాడి... ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తమను అడ్డుకోవడానికి ఇనుప కంచెలు వేయడం దారుణమన్నారు. ఇంత దారుణమైన ప్రజాస్వామ్య పద్ధతిని తాము ఎప్పుడూ చూడలేదన్నారు. కాంగ్రెస్ ఏ రకమైన పాలనను అందిస్తుందో ప్రజలంతా చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ తీరును తాము బయటపెట్టే ప్రయత్నం చేశామని కడియం అన్నారు.

More Telugu News