Kadiam Srihari: మేడిగడ్డలో రెండు మూడు పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయి... బాధ్యులపై చర్యలు తీసుకోండి.. అభ్యంతరం లేదు: కడియం శ్రీహరి

  • కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో బ్యారేజీలు, పంప్ హౌస్‌లు, కెనాల్స్, సబ్ స్టేషన్లు ఉన్నాయన్న కడియం
  • ఇందులో భాగమైన మేడిగడ్డలో కేవలం 2, 3 పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని వ్యాఖ్య
  • కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఏడాదికి రూ.1.36 లక్షల కోట్లు అవసరమని వెల్లడి
Kadiyam Srihari talks about medigadda issue

కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో బ్యారేజీలు, పంప్ హౌస్‌లు, కెనాల్స్, సబ్ స్టేషన్లు ఉన్నాయని... ఇందులో భాగమైన మేడిగడ్డలో కేవలం 2, 3 పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈ అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చునని... తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై శాసన సభలో జరిగిన చర్చ సందర్భంగా కడియం మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఏడాదికి రూ.1.36 లక్షల కోట్లు అవసరమన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్థిక అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను ఆయన చదివి వినిపించారు.

కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణలో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరిట 13 హామీలు ఇచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, యువత, రైతు, మహిళా డిక్లరేషన్లు ప్రకటించారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలు లెక్కిస్తే 420 ఉన్నాయన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ సరిపోదన్నారు. రుణమాఫీ సహా మిగతావి అదనం అన్నారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినప్పటికీ... ఇప్పటి వరకు చేయలేదన్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని... వీటికి రూ.24వేల కోట్లు అవసరమన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఒక్కో ఇంటికి ఒక మహిళకు రూ.2500 ఇచ్చినా రూ.20వేల కోట్లు కావాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరణ జరిగిందన్నారు. ప్రాజెక్టు విషయంలో గోరంతను కొండంతలు చేసి ప్రజలను పక్కదోవ పట్టించవద్దని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరంతో అనేక రిజర్వాయర్లు పెరిగాయని... నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందన్నారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చునన్నారు. ఇందులో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

More Telugu News