Nara Lokesh: శంఖారావం సభకు వైసీపీ దిష్టి తగిలినట్లుంది... మొదటిసారి సభలో జనరేటర్ కాలిపోయింది: నారా లోకేశ్

  • ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీడీపీ శంఖారావం
  • పార్వతీపురంలో సభకు హాజరైన లోకేశ్
  • సీఎం జగన్ సినిమాల పిచ్చి ముదిరిందని విమర్శలు
  • ఖేలో ఆంధ్రాను కాపీ కొట్టి ఆడుదాం ఆంధ్రా అంటున్నారని వ్యాఖ్యలు
  • వైసీపీ ఎంపీలు కేంద్రంలో పరువు తీశారన్న లోకేశ్
Nara Lokesh attends Shankharavam meeting in Parvathipuram

ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురంలో నిర్వహించిన శంఖారావం సభకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... మా శంఖారావం సభకు వైసీపీ దిష్టి తగిలినట్లుంది... మొదటిసారి సభలో జనరేటర్ కాలిపోయింది అని వెల్లడించారు. 

ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలు, నా కుటుంబ సభ్యుల సమానులైన పార్టీ కార్యకర్తలకు నమస్కారాలు అంటూ లోకేశ్ ప్రసంగం ప్రారంభించారు. "ఉత్తరాంధ్ర దద్దరిల్లింది. ఉత్తరాంధ్ర యూత్ పవర్ అదిరిపోయింది. ఉద్యమాల, పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర గడ్డ. ఫ్యాన్ కు షాకిచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. విజయనగరం జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చేది రాజసం. ఉత్తరాంధ్ర అంటే పైడితల్లి అమ్మవారు గుర్తుకువస్తారు. అల్లూరి సీతారామరాజు నడిచిన నేల ఈ విజయనగరం నేల. ఇలాంటి పవిత్ర నేలపై అడుగుపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని లోకేశ్ పేర్కొన్నారు.

జగన్ జబ్బు పేరు ఇదే!

ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఒక జబ్బు వచ్చింది. జబ్బు పేరు డయేరియా. కావాలంటే తాడేపల్లి కొంపకు వెళ్లి పరీక్షలు నిర్వహిద్దాం. ఇదో చెత్త ప్రభుత్వం. నిన్నగాక మొన్న గుంటూరులో సురక్షితమైన తాగునీరు ఇచ్చే పరిస్థితి లేక కలుషిత నీరు తాగి ఇద్దరు చనిపోయారు. వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. పరిస్థితి ఇంత సీరియస్ గా ఉన్నా దున్నపోతు ప్రభుత్వానికి సమీక్ష చేసే తీరిక లేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. టీడీపీ మహానాడులో చంద్రబాబు నాటిన తులసిమొక్కను అన్నారు. ఇప్పుడు జగన్ పెంచిన గంజాయి మొక్కలా ఎలా మారారో చెప్పాలి. 

జగన్ రెడ్డి సినిమాల పిచ్చి ముదిరింది!

జగన్ రెడ్డి సినిమా పిచ్చి ఎక్కువైంది. ఓ వైపు వ్యూహం, మరోవైపు యాత్ర సినిమా అంటారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు ఫ్రీగా టికెట్లు ఇచ్చినా సినిమా చూడటం లేదు. సినిమా అట్టర్ ప్లాప్. వైసీపీ పని అయిపోయింది, ఇక అంతిమయాత్రే అంటున్నారు. సినిమా మొదటిరోజు కూడా ఎవరూ చూడలేదు. కానీ సినిమా తీసి నష్టపోయిన ప్రొడ్యూసర్ జగన్ రెడ్డి దగ్గరికి వెళ్లి ఆదుకోమంటే ఛీ పో అన్నారు. అతడికి కోపం వచ్చి అంతిమయాత్ర పోస్టర్ వేసి చూపించారు. డబ్బులు ఇవ్వకపోతే అంతిమయాత్ర సినిమా తీస్తాననడంతో భయపడిపోయి హార్సిలీహిల్స్ వద్ద ఖరీదైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చారు. 

ఖేలో ఆంధ్రాను కాపీ కొట్టారు!

జగన్ ను చూస్తే పిట్టల దొర గుర్తుకు వస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఖేలో ఆంధ్రాను ఆడుదాం ఆంధ్రా అని మార్చారు. అది కాస్తా విఫలమైంది. మా జీవితాలతో ఆడింది చాలు, ఇక వెళ్లండి అని జనం ఛీ కొట్టారు. ఎన్నికల ముందు నియోజకవర్గానికో స్టేడియం నిర్మిస్తామన్నారు. క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తామన్నారు. ఏ నియోజకవర్గంలో అయినా అవి ఏర్పాటుచేశారా? 

జగన్ ఐపీఎల్ టీం పెడతామంటున్నారు. దాని పేరు కోడికత్తి వారియర్స్ . ఆ టీమ్ లో ప్లేయర్స్ గా బాబాయిని గొడ్డలితో నరికిచంపిన ఆల్ రౌండర్ అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి రాంబాబు, గంట స్టార్ అవంతి శ్రీనివాస్, సీనియర్ బ్యాట్స్ మన్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ ఎంపీ మార్గాని భరత్, బూతుల స్టార్ కొడాలి నాని, కమెడియన్ బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆటగాళ్లుగా ఉంటారు.

ఈ ఎంపీలు కేంద్రంలో మన పరువు తీశారు!
  
25కు 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామన్నారు. మొత్తం వైసీపీకి 31 మంది ఎంపీలు ఉంటే ఏనాడైనా ప్రత్యేక హోదా గురించి అడిగిరా? ప్రత్యేక హోదా కాదు కదా.. కేంద్రంలో మన పరువు తీశారు. 

ఒక ఎంపీనేమో జిప్పులు విప్పదీసి అన్నీ చూపిస్తాడు, మరో ఎంపీ బాబాయిని లేపేసిన వ్యక్తి. ఇంకో ఎంపీ సీబీఐ వస్తే కర్నూలు ఆసుపత్రిలో దాక్కుంటాడు. ఓ ఎంపీ టిక్ టాక్, యూట్యూబ్ రీల్స్ లో బిజీగా ఉంటాడు. విశాఖ ఎంపీ భార్య, కొడుకుని కిడ్నాప్ చేశారనే భయంతో ఏకంగా హైదరాబాద్ వెళ్లి దాక్కుంటాడు. 

జగన్ అవినీతి లెక్కలను పుస్తకంలో రాసుకోవడం ఆయన పని

ఇక ఎంపీ విజయసాయిరెడ్డి. జగన్ రెడ్డి అవినీతి కేసుల్లో ఎ2గా ఉన్నారు. జగన్ చేసిన అవినీతి లెక్కలన్నీ పుస్తకంలో రాసుకోవడం ఆయన పని. వైసీపీ నాయకులు సామాజిక బస్సుయాత్ర చేస్తున్నారు. అసలు వైసీపీలోనే సామాజిక న్యాయం లేదు. 

ఇప్పటివరకు 63 మంది ఎమ్మెల్యేలను మార్చారు. 16 మంది ఎంపీలను ట్రాన్స్ ఫర్ చేశారు. వారిలో 90 శాతం మంది బీసీ, ఎస్సీలే ఉన్నారు. వారి పార్టీకి చెందిన బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆయన వాపోయారు. 

చిరంజీవి మాస్టారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశాం

పార్వతీపురంలో చిరంజీవి మాస్టారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెయ్యి కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. రూ.350 కోట్ల తండాలకు రోడ్లు వేశాం. పార్వతీపురం హెడ్ క్వార్టర్ లో పేదలకు 560 టిడ్కో ఇళ్లు నిర్మించాం. రూ.66 కోట్లతో తాగునీటి సమస్యను పరిష్కరించాం. ఏరియా ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేశాం. జంఝావతి రిజర్వాయర్ కు రూ.43 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం పనులు నిలిపివేసింది. హార్టికల్చర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఆనాడు ఏర్పాటుచేశాం. టీడీపీ పాలనలో పార్వతీపురం నియోజకవర్గం అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచింది. 

ఆయనకు అవినీతి రావు అని పేరు పెట్టాలేమో!

పార్వతీపురం నియోజకవర్గాన్ని నేడు అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చారు.  ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జోగారావు. ఆయనకు అవినీతి రావు అని పేరు పెట్టాలేమో. ఎక్కడ భూమి కనిపించినా కబ్జా చేస్తున్నారు. ఎక్కడ చెరువు కనిపించినా పట్టాలు సృష్టిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా అమ్ముకుంటున్నారు. 

పెద్ద సైకో జగన్ రెడ్డి అయితే చిన్న సైకో జోగారావు. ఏకంగా ఎమ్మార్వో సంతకాన్నే ఫోర్జరీ చేస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేను ఎక్కడా చూడలేదు. టీడీపీ అధికారంలోకి రాగానే ఎంక్వైరీ వేసి, ఆ భూములన్నీ స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు ఇస్తాం.

ఈసారి మమ్మల్ని గెలిపించండి... ఇవన్నీ చేస్తాం!

2024లో టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపించండి. పార్వతీపురానికి బైపాస్ రోడ్డు వేస్తాం, జంఝావతి రిజర్వాయర్ పనులు పూర్తిచేస్తాం, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. ఆడారు మినీ రిజర్వాయర్ ద్వారా తండాలకు మంచినీరు ఇస్తాం, సీతానగరం, బలిజపేట మండలాలకు తోటపల్లి నుంచి సాగునీరు అందిస్తాం. పార్వతీపురం శివార్లలో డంపింగ్ యార్డ్ తీసుకువచ్చే బాధ్యత, పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మేం తీసుకుంటాం. స్పోర్ట్ స్టేడియం నిర్మిస్తాం.  

More Telugu News