అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్
- సీఎం రేవంత్ రెడ్డి భాషపై అభ్యంతరం వ్యక్తం చేసిన కడియం
- నిండు సభలో మాట్లాడే మాటలు కావన్న మాజీ మంత్రి
- అధికార పార్టీ తీరుతో అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాళేశ్వరం, గోదావరి జలాలపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదలచేస్తే చర్చలో తామంతా పాల్గొంటామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరగడం మంచిదేనని, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి భాషపై తమకు అభ్యంతరం ఉందని కడియం చెప్పారు. ఓ ముఖ్యమంత్రి సభలో మాట్లాడాల్సిన భాష ఇది కాదని అన్నారు. సభలో మట్లాడకూడని భాష ఉపయోగించటం సబబు కాదని, సీఎం తన గౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. దీనిపై అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బల్లలు చరుస్తూ, అరుపులతో నిరసన తెలిపారు. అధికార పార్టీ సభ్యుల తీరుతో సభలో నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటకొచ్చారు.