K V Vijayendra Prasad: అది రాజమౌళి చేయాల్సిన సినిమా: విజయేంద్ర ప్రసాద్

  • ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్
  • భజరంగీ భాయిజాన్ కథను మొదట రాజమౌళికి చెప్పానని వెల్లడి
  • రాజమౌళి కంటతడి పెట్టుకున్నాడన్న విజయేంద్ర ప్రసాద్
  • అయితే బాహుబలితో బిజీగా ఉండడంతో చేయలేకపోయాడని వివరణ 
Vijayendra Prasad says Bhajarangi Baijaan movie supposed to do Rajamouli

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, సుప్రసిద్ధ సినీ కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమా భజరంగీ భాయిజాన్ వాస్తవానికి రాజమౌళి చేయాల్సిన సినిమా అని అన్నారు. ఆ సినిమా కథను రాజమౌళికి చెప్పినప్పుడు కంటతడి పెట్టుకున్నాడని తెలిపారు. 

అయితే, ఆ సినిమా కథను ఇతరులకు ఇచ్చేయాలని చెప్పాడని వివరించారు. తాను ఆ కథ చెప్పిన సమయంలో బాహుబలి షూటింగ్ జరుగుతోందని అన్నారు. 

"నాన్నా... నువ్వా కథ చెప్పినప్పుడు రోహిణి కార్తె ఎండల్లో 2 వేల మందితో బాహుబలి షూటింగ్ చేస్తున్నాను... పైనా కిందా మండిపోతోంది... నువ్వు ఒక పదిహేను రోజుల ముందు ఆ కథ చెప్పి ఉన్నా, పదిహేను రోజుల తర్వాత ఆ కథ చెప్పి ఉన్నా నేను ఆ సినిమా చేసేవాడ్ని అని రాజమౌళి అన్నాడు. 

భజరంగీ భాయిజాన్ కథను ఆమిర్ ఖాన్ కు చెబితే హీరో పాత్ర తనకు కనెక్ట్ కావడంలేదని సందేశం పంపాడు. సినిమా రిలీజైన తర్వాత ఆమిర్ ఖాన్ ఇంటికి పిలిచారు. గజనీ సినిమాను కూడా నేను ఇలాగే మొదట వద్దనన్నాను. కానీ సూర్య మీరు చేయాల్సిందేనని పట్టుబట్టాడు. ఇప్పుడు భజరంగీ భాయిజాన్ సినిమా విషయంలోనూ అలా ఎవరైనా చెప్పి ఉంటే బాగుండేది అని అన్నాడు" అంటూ విజయేంద్రప్రసాద్ వివరించారు.

More Telugu News