KL Rahul: మూడో టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం

  • గాయంతో బాధపడుతున్న కేఎల్ రాహుల్
  • ఇంకా ఫిట్ నెస్ సాధించని వైనం
  • ఫిబ్రవరి 15 నుంచి ఇంగ్లండ్ తో మూడో టెస్టు
  • మూడో టెస్టుకు రాహుల్ స్థానంలో దేవదత్ పడిక్కల్
KL Rahul ruled out of third test

టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుండగా, ఏ టెస్టుకు ఎవరు జట్టులో ఉంటారో, ఎవరు దూరమవుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వ్యక్తిగత కారణాలతో స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ దాదాపు సిరీస్ మొత్తానికి దూరం కాగా, శ్రేయాస్ అయ్యర్ మిగిలిన మూడు టెస్టులకు దూరమయ్యాడు. 

ఫిబ్రవరి 15 నుంచి టీమిండియా-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జరగనుండగా, మరో కీలక బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ కూడా ఈ టెస్టులో ఆడడంలేదు. కేఎల్ రాహుల్ 90 శాతం ఫిట్ నెస్ మాత్రమే సాధించాడని, సంపూర్ణంగా ఫిట్ గా ఉంటేనే, సిరీస్ లోని మిగిలిన టెస్టుల్లో ఆడేది, లేనిది నిర్ణయిస్తామని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడని వెల్లడించింది. 

కాగా, మూడో టెస్టు కోసం కేఎల్ రాహుల్ స్థానంలో కర్ణాటక బ్యాట్స్ మన్ దేవదత్ పడిక్కల్ ను ఎంపిక చేసినట్టు బోర్డు వివరించింది. 

ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టు మాత్రమే ఆడిన కేఎల్ రాహుల్ గాయంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. గాయం తీవ్రత దృష్ట్యా అతడు కోలుకోవడానికి మరికొంత సమయం ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఇంగ్లండ్ తో మూడో టెస్టుకు టీమిండియా ఇదే...

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మాన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, ఆకాశ్ దీప్, దేవదత్ పడిక్కల్.

More Telugu News