Mithun Chakraborty: ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన మిథున్ చక్రవర్తికి ప్రధాని ఫోన్

  • కోల్ కతాలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన మిథున్ చక్రవర్తి
  • హుటాహుటీన ఆసుపత్రికి తరలించిన వైద్యులు
  • వైద్య పరీక్షల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తేలిన వైనం
  • ప్రధాని తనను మందలించారన్న మిథున్
PM Modi phone call to hospitalised Mithun Chakraborty

బాలీవుడ్ నట దిగ్గజం, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి కొన్ని రోజుల కిందట ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరడం తెలిసిందే. కోల్ కతాలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన మిథున్ చక్రవర్తిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిథున్ చక్రవర్తికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ విషయాన్ని మిథున్ వెల్లడించారు. మోదీ తనకు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారని తెలిపారు. ఆరోగ్యంపై అశ్రద్ధ చూపవద్దంటూ తనను సున్నితంగా మందలించారని వివరించారు. ఇకపై ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటానని ప్రధానితో చెప్పానని మిథున్ పేర్కొన్నారు. 

ఆసుపత్రిలో చేరిన వెంటనే మిథున్ చక్రవర్తికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆందోళన కలిగించే అంశాలేవీ లేవని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. 

తన ఆరోగ్యంపై మిథున్ మాట్లాడుతూ, తనకెలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్లు చెప్పారని, ప్రస్తుతం కోలుకుంటున్నానని వెల్లడించారు. అయితే ఆహార అలవాట్లను మార్చుకోవాల్సి ఉందని, బహుశా రేపటి నుంచే ఆ పని మొదలుపెడతానని తెలిపారు.

More Telugu News