Kinjarapu Ram Mohan Naidu: మాట నిలుపుకున్న లోకేశ్ అన్నకు కృతజ్ఞతలు: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • శ్రీకాకుళం నియోజకవర్గంలో శంఖారావం సభ
  • హాజరైన టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు
  • యువగళం పాదయాత్ర ఉత్తరాంధ్రకు వస్తుందని భావించామని వెల్లడి
  • భీమిలిలోనే ముగియడంతో నిరాశ చెందామని వివరణ
  • మాట నిలుపుకుని లోకేశ్ అన్న శంఖారావం చేపట్టారని వ్యాఖ్యలు 
TDP MP Ram Mohan Naidu thanked Nara Lokesh

శ్రీకాకుళం నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ శంఖారావం సభలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, రాబోయే కాలంలో టీడీపీ-జనసేన విజయానికి నాంది పలుకుతూ యువనేత లోకేశ్ శంఖారావం యాత్ర చేపట్టారని వెల్లడించారు. యువగళం పాదయాత్ర తమ ప్రాంతానికి కూడా వస్తుందని ఎంతో ఆశతో తామంతా ఎదురుచూశామని, లోకేశ్ పాదయాత్ర భీమిలిలోనే నిలిచిపోవడంతో నిరాశ చెందామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అయితే, మాటమీద నిలబడి ఈరోజు తమ నియోజకవర్గానికి వచ్చినందుకు లోకేశ్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. 

"రాష్ట్రం సర్వనాశనం అవుతున్న స్థితినుంచి దేశంలోనే నెం.1గా రాష్ట్రాన్ని తయారుచేయడానికి లోకేశ్ ముందుకు వచ్చారు. సైకో పాలనలో బాధితులుగా మారిన ప్రజలకు భరోసా ఇచ్చేందుకు లోకేశ్ పాదయాత్ర చేశారు. మరో రెండు నెలల్లో రానున్న ఎన్నికల్లో సైకోల చర్యలను తిప్పికొట్టేందుకు టీడీపీ-జనసేన కార్యకర్తలు నడుం బిగించాలి. 

టీడీపీ హయాంలో శ్రీకాకుళం నియోజకవర్గానికి కోట్ల రూపాయల నిధులు తెచ్చాం, మున్సిపాలిటీగా ఉన్న పట్టణానికి కార్పొరేషన్ హోదా ఇచ్చింది కూడా చంద్రబాబుగారే. వైసీపీ నాయకులకు ఇసుక దోచుకోవడం తప్ప, రైతులకు నీరందించడం తెలీదు. 

పేరుకే శ్రీకాకుళం జిల్లాకేంద్రం,  నియోజకవర్గంలో ఒక్కరోడ్డు కూడా సక్రమంగా లేదు, ఈ రోడ్లపై తిరిగితే నరకానికి వెళ్లడం ఖాయం! శ్రీకాకుళం నుంచి ఆముదాల వలస వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా మంత్రి, స్పీకర్ పట్టించుకోకుండా గాలికొదిలేశారు. 

శ్రీకాకుళం వలసల జిల్లా, స్థానికంగా ఉద్యోగావకాశాలు లేక ఇక్కడ యువత బాధపడుతున్నారు, రాబోయే ప్రభుత్వంలో వలసలను నివారించడానికి ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ జోన్, సెజ్ లు ఏర్పాటు చేయాలి. రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాలవారు ఇక్కడకు ఉద్యోగాల కోసం వచ్చేలా అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంతం నుంచి ఆర్మీకి వెళ్లి దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకోవాలి. 

ఐదేళ్లయినా ఇక్కడ స్టేడియంలో ఒక్క ఇటుక వేయలేదు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను గాలికొదిలేశారు. మళ్లీ మన ప్రభుత్వం వచ్చాక స్పోర్ట్ కాంప్లెక్స్, స్టేడియం పూర్తిచేసే బాధ్యత మేం తీసుకుంటాం. రానున్న కాలంలో శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చడానికి చంద్రబాబుగారు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ ను ఏవిధంగా అభివృద్ధి చేశారో, శ్రీకాకుళంను కూడా అలాగే అభివృద్ధి చేయాలని చంద్రబాబును కోరతాం. 

చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తేనే అదంతా సాధ్యమవుతుంది. పసుపు కండువా సత్తా ఏమిటో వైసీపీ సైకోలకు తెలియజేయాలి. జనసేన సోదరులను కూడా కలుపుకొని ముందుకు సాగాలి. చంద్రబాబు – పవన్ కళ్యాణ్ కలసి వస్తున్నారంటే జగన్ కు నిద్రపట్టడం లేదు. 

ప్రజలు డిసైడ్ అయ్యారు... జగన్ పని అయిపోయింది, మరోసారి ఆయనకు ఓటువేయకూడదని నిర్ణయించుకున్నారు. రాబోయే ఎన్నికలకు కేడర్ ను సిద్ధం చేసేందుకే లోకేశ్ అన్న శంఖారావం యాత్ర ప్రారంభించారు. ఒక బండికి ఉండే రెండుచక్రాల మాదిరిగా టీడీపీ-జనసేన కార్యకర్తలు పనిచేయాలి" అని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.

More Telugu News