Footballer Dies: పిడుగుపాటుతో గ్రౌండ్ లోనే చనిపోయిన ఫుట్ బాల్ ప్లేయర్.. వీడియో ఇదిగో!

Indonesian Footballer Dies After Being Hit By Lightning During Match
  • ఇండోనేషియాలో ఫుట్ బాల్ మ్యాచ్ లో ఘటన
  • గ్రౌండ్ లో నడుచుకుంటూ వెళుతుండగా పిడుగుపాటు
  • నిలుచున్న చోటే కుప్పకూలిన ప్లేయర్
  • ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణం
ఇండోనేషియాలో ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్ లో పిడుగుపడింది. దీంతో మ్యాచ్ ఆడుతున్న ఓ ప్లేయర్ నిలుచున్న చోటే కుప్పకూలాడు. క్షణాల్లో జరిగిపోయిన ఈ ఘటన అక్కడి కెమెరాల్లో రికార్డయింది. ఆదివారం (ఈ నెల 11న) జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పటి వరకు ఉత్సాహంగా ఆడుతూ తమ జట్టును గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సహచరుడు క్షణాలలో నిర్జీవంగా మారడం ప్లేయర్లను షాక్ కు గురిచేసింది. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు కాసేపటి వరకు ఏం జరిగిందో తెలియలేదు.. పిడుగు పడి ప్లేయర్ చనిపోయాడని తెలిసి నివ్వెరపోయారు.

స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఆదివారం ఎఫ్ సీ బాండుంగ్, ఎఫ్ బీఐ సుబాంగ్ జట్ల మధ్య వెస్ట్ జావాలోని సిలివాంగి స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు పోటాపోటీగా గోల్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో గ్రౌండ్ లో నడుచుకుంటూ వెళుతున్న ఓ ప్లేయర్ పై పిడుగు పడింది. నిలువునా కుప్పకూలిన సహచరుడి దగ్గరికి మిగతా ప్లేయర్లు పరుగెత్తుకెళ్లారు. సీపీఆర్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని ప్రకటించారు.
Footballer Dies
Indonesia
Football Player
Football Match
Lightning

More Telugu News