KL Rahul: మూడో టెస్టు కోసం కేఎల్ రాహుల్ నెట్ ప్రాక్టీస్.. అయినా సరే సందిగ్ధం!

  • రాహుల్ నెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్
  • చివరి మూడు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో చోటు లభించినప్పటికీ ఫిట్‌నెస్ ఉంటేనే తుది జట్టులో చోటు
  • రవీంద్ర జడేజాదీ ఇదే పరిస్థితి
  • 15 నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు
KL Rahul Batting In Nets After Injury Ahead Of 3rd Test Goes Viral

ఇంగ్లండ్‌తో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో గాయపడిన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వైజాగ్ టెస్టుకు దూరమయ్యాడు. రాజ్‌కోట్‌లో జరగనున్న మూడో టెస్టుకు అతడు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయం నుంచి కోలుకున్న రాహుల్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. నెట్స్‌లో అతడి ప్రాక్టీస్ చూసిన అభిమానులు అతడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్టు  కామెంట్లు పెడుతున్నారు. అయితే, బీసీసీఐ మాత్రం కీలక ప్రకటన చేసింది. ప్రాక్టీస్ చేస్తున్నంత మాత్రాన జట్టులోకి వచ్చే అవకాశం లేదని, ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే జట్టులోకి వస్తాడని తెలిపింది.

కేఎల్ రాహుల్‌ను పక్కనపెడితే టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విషయంలోనూ డైలమా కొనసాగుతోంది. హైదరాబాద్ టెస్టులోనే గాయపడిన జడేజా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. మిగతా మూడు టెస్టులకు ప్రకటించిన జట్టులో వీరికి చోటు కల్పించినప్పటికీ తుది జట్టులో చోటుమాత్రం వారి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.

ఇక అయ్యర్ స్థానం మాత్రం ప్రశ్నార్థకమైంది. హైదరాబాద్ టెస్టులో 35, 13, విశాఖ టెస్టులో 27, 29 చేసిన అయ్యర్ పరుగుల కోసం ఆపసోపాలు పడుతున్నాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. అయితే, అతడు కూడా గాయంతో బాధపడుతున్నట్టు పలు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే, టెస్టు జట్టు నుంచి అతడిని పక్కన పెట్టడానికి గల కారణాలను మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. అయ్యర్‌కు జట్టులో స్థానం దక్కకపోవడంతో రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్ స్థానాలు పదిలంగా ఉన్నాయి. అయితే, సెలక్టర్లు ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్, ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్‌కు కూడా స్థానం లభించలేదు. 

చీలమండ గాయంతో బాధపడుతున్న స్టార్ పేసర్ మహ్మద్ షమీ జట్టు బయటే ఉన్నాడు. అతడి బెంగాల్ టీమ్మేట్, ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్‌‌కు తొలిసారి అవకాశం లభించింది. ఇండియా ఏ జట్టులో అద్భుత ప్రదర్శనకు గాను సెలక్టర్ల నుంచి తొలి కాల్ అందుకున్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇరు జట్లు చెరో టెస్టు గెలుచుకుని సమ ఉజ్జీలుగా ఉన్నాయి. 15న రాజ్‌కోట్‌లో మూడో టెస్టు జరగనుంది. 

చివరి మూడు టెస్టులకు భారత జట్టు: రోహిత్‌శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్) ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్.

More Telugu News