Pakistan Election: పాకిస్థాన్ ఎన్నికల్లో ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. మరి నెక్స్ట్ ఏమిటి?

What is Next In Pakistan Election Deadlock as no got majority to form Government

  • నవాజ్ షరీఫ్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు
  • చిన్న పార్టీలతో చేతులు కలిపి మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్న ఇమ్రాన్ మద్ధతిచ్చిన స్వతంత్రులు
  • పీపీపీ సారధ్యంలో సంకీర్ణ సర్కారు, సైన్యం పాలనకూ అవకాశాలు
  • పాకిస్థాన్‌లో ఆసక్తికరంగా మారిన రాజకీయ సమీకరణాలు

కొన్ని హింసాత్మక ఘటనలు, రిగ్గింగ్.. వంటి పరిస్థితుల మధ్య పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ ఏ పార్టీకీ దక్కలేదు. పీటీఐ పార్టీ మద్దతిచ్చిన స్వతంత్రులు- 93, పీఎంఎల్(ఎన్)-73, పీపీపీ-54, ఎంక్యూఎం-17, ఇతరులు 19 స్థానాల్లో గెలిచారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 169 సీట్ల సాధారణ మెజారిటీ ఏ పార్టీకీ లభించలేదు. మెజారిటీ స్థానాల్లో గెలవకపోయినప్పటికీ  మాజీ ప్రధానులు నవాజ్ షరీఫ్ (పీఎంఎల్(ఎన్) పార్టీ), ఇమ్రాన్ ఖాన్ (పీటీఐ) ఇద్దరూ గెలుపు తమదేనని ప్రకటించుకున్నారు. 

దీంతో పాకిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలు ఉన్నాయి. వీటిలో 266 సీట్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాలు రిజర్వుడ్‌ స్థానాలుగా ఉన్నాయి. 60 స్థానాలు మహిళలకు, 10 సీట్లు ముస్లిమేతరులకు కేటాయిస్తారు. అసెంబ్లీలో పార్టీల బలం ఆధారంగా రిజర్వుడ్ స్థానాలకు ఎంపీలను ఆయా పార్టీలు ఎంపిక చేస్తాయి. తాజా రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అక్కడ ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

షరీఫ్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం

73 సీట్లు గెలుచుకున్న నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్(ఎన్) పార్టీ.. 53 సీట్లు గెలుచుకున్న బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP)తో ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకారం కుదుర్చుకుంది. వీరిద్దరు కీలక నేతలు చిన్న పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నవాజ్ షరీఫ్ లేదా ఆయన సోదరుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలున్నాయి. ఇతర పార్టీలకు కీలకమైన పదవులు కట్టబెట్టే ఛాన్స్ ఉంది.

చిన్న పార్టీలతో జత కడుతున్న ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు

ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పీటీఐ పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు ఈ ఎన్నికల్లో అత్యధికంగా 93 సీట్లు గెలుచుకున్నారు. వీరంతా ఇప్పటికే ఒక చిన్న పార్టీతో చేతులు కలిపారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలుంటాయి. అయితే జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో స్పష్టత లేదు.

పీపీపీ సారధ్యంలో సంకీర్ణ ప్రభుత్వం

నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకున్నప్పటికీ పీపీపీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపించడం లేదు. దీంతో పీపీపీ నాయకుడు, యువనేత బిలావల్ భుట్టో జర్దారీ ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం లేకపోలేదు. ప్రచారం సమయంలో కూడా తనకు ప్రధానమంత్రిగా అవకాశం ఇవ్వాలని ఓటర్లను భుట్టో అభ్యర్థించారు. వయసు మళ్లిన నేతలను పక్కన పెట్టాలని కోరిన విషయం తెలిసిందే.

సైన్యం పాలనకూ అవకాశం

పాకిస్థాన్‌లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే దేశంలో అత్యంత శక్తిమంతమైన, వ్యవస్థీకృత శక్తిగా ఉన్న పాకిస్థాన్ సైన్యం పాలన కొనసాగించే అవకాశం ఉంది. పాక్ చరిత్రలో ఆ దేశ ఆర్మీ మూడుసార్లు పరిపాలించింది. చివరిసారిగా 1999లో షరీఫ్ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం చేపట్టింది. తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ పార్టీలు హూందాగా వ్యవహరించాలని పాకిస్థాన్ సైన్యం ఇప్పటికే పిలుపునిచ్చింది.

Pakistan Election
Pakistan
PPP
PTI Imran Khan
Nawaz Sharif
  • Loading...

More Telugu News