UPI: నేటి నుంచి శ్రీలంక, మారిషస్‌లో యూపీఐ సేవలు

After France UPI services to be launched in Sri Lanka and Mauritius today
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • కార్యక్రమంలో పాల్గొంటున్న శ్రీలంక అధ్యక్షుడు, మారిషస్ ప్రధాని
  • భారత విదేశాంగ శాఖ ప్రకటన
భారతీయులకు నగదు బదిలీని అత్యంత సులభతరం చేసిన యూపీఐ సేవలు నేటి నుంచి శ్రీలంక, మారిషస్‌లో కూడా అందుబాటులోకి రానున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషన్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తో కలిసి మోదీ పాల్గొంటారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 

యూపీఐ సేవలతో భారతీయులకు శ్రీలంక, మారిషస్‌లో చెల్లింపులు మరింత సులభతరం అవుతాయని విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్‌లోని శ్రీలంక, మారిషస్ టూరిస్టులకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. యూపీఐ సేవలతో డిజిటల్ చెల్లింపులు సులభతరం అవుతాయని, ఇరు దేశాల మధ్య డిజిటల్ కనెక్టివిటీ పెరుగుతుందని విదేశాంగ శాఖ పేర్కొంది. యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో మారిషస్ బ్యాంకులు రూపే చెల్లింపుల వ్యవస్థ ఆధారిత కార్డులను కూడా జారీ చేసేందుకు వీలు చిక్కింది. వీటి ద్వారా ఇరు దేశాల్లోనూ చెల్లింపులు జరపొచ్చు. 

ఇటీవలే ఫ్రాన్స్‌లో కూడా యూపీఐ చెల్లింపుల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. భారత్‌కు చెందిన ఎన్‌పీసీఐ, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఈకామర్స్, చెల్లింపుల సంస్థ లైరాతో కలిసి అక్కడ యూపీఐ సేవలు ప్రారంభించింది. యూపీఐతో చెల్లింపులు స్వీకరించిన తొలి మర్చెంట్‌గా ఈఫిల్ టవర్ నిలిచింది.
UPI
Sri Lanka
Mauritius
India
Narendra Modi

More Telugu News