Tirupati LS Bypolls: తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసులపై వేటు

  • 2021లో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక
  • భారీగా దొంగ ఓట్లు వేశారంటూ విపక్షాల ఆరోపణలు
  • దొంగ ఓట్ల కేసును నీరుగార్చారంటూ పోలీసులపై ఆరోపణలు
  • ఈసీ ఆదేశాలతో సస్పెన్షన్ వేటు వేసిన డీఐజీ అమ్మిరెడ్డి
EC orders suspension on police related to Tirupati fake voters issue

తిరుపతి ఉప ఎన్నిక దొంగ ఓట్ల వ్యవహారం అధికారుల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా, విజయవాడ మెప్మా ఏడీ చంద్రమౌళీశ్వర్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా, ఈ వ్యవహారంలో పోలీసులపైనా చర్యలు తీసుకున్నారు. 

తిరుపతి ఉప ఎన్నిక సమయంలో దొంగ ఓట్ల కేసును నీరుగార్చారన్న ఆరోపణలపై పోలీసుల మీద వేటు పడింది. నాడు తిరుపతి సిటీ తూర్పు, పశ్చిమ పోలీస్ స్టేషన్ల సీఐలు, తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ గా విధుల్లో ఉన్నవారిపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ఈసీ ఆదేశాల మేరకు వీరిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. అదే సమయంలో అలిపిరి సీఐని వేకెంట్ రిజర్వ్ కు బదిలీ చేసింది. 

2021లో తిరుపతి ఉప ఎన్నిక జరిగిన సమయంలో తిరుపతి తూర్పు సీఐగా శివప్రసాద్ రెడ్డి, తిరుపతి పశ్చిమ సీఐగా శివప్రసాద్, తిరుపతి తూర్పు ఎస్ఐగా జయస్వాములు, తిరుపతి తూర్పు హెడ్ కానిస్టేబుల్ గా ద్వారకానాథరెడ్డి విధుల్లో ఉన్నారు. దొంగ ఓట్ల కేసులో సాక్ష్యాధారాల్లేవంటూ అప్పటి తిరుపతి పశ్చిమ సీఐ శివప్రసాద్ కేసు మూసివేశారు. 

సీఐ శివప్రసాద్ ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్నారు. తిరుపతి తూర్పు సీఐ శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి ఎస్ బీలో పనిచేస్తున్నారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో... ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుపతి పోలీసులను సస్పెండ్ చేస్తూ నేడు డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News