GPS Bases Toll Collection: దేశవ్యాప్తంగా త్వరలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్లు

  • ప్రస్తుతం టోల్ ప్లాజాల ద్వారా వసూళ్లు
  • ఇకపై రోడ్డుపై ప్రయాణించిన దూరానికే చెల్లింపు
  • ఏప్రిల్ నాటికి జీపీఎస్ ఆధారిత వసూళ్ల వ్యవస్థ
GPS bases toll collection system soon in India

దేశంలో రోడ్ల విస్తరణ అనంతరం టోల్ ప్లాజా వ్యవస్థలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ఈ స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

ఈ జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలో ఆటోమేటిగ్గా నెంబర్ ప్లేట్ ను గుర్తించే సాంకేతికత ఉంటుంది. హైవేలపై నిర్దేశిత ప్రాంతాల్లో అమర్చిన కెమెరాలు ఓ వాహనం రోడ్డెక్కినప్పటి నుంచి అది హైవేపై ఎంత దూరం ప్రయాణిస్తుందో గుర్తిస్తాయి. 

నూతనంగా తీసుకువస్తున్న ఈ జీపీఎస్ టోల్ సిస్టమ్ ప్రకారం... ఓ వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగానే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. సదరు వాహనం ఎన్ని టోల్ ప్లాజాలు దాటి వచ్చిందో ఈ జీపీఎస్ వ్యవస్థ నమోదు చేస్తుంది. దాని ఆధారంగానే టోల్ ఫీజును లెక్కిస్తారు.

ఇప్పటివరకు ఆయా టోల్ ప్లాజాల వద్ద ఫిక్స్ డ్ చార్జీలను చెల్లించాల్సి వచ్చేది. ఈ వ్యవస్థలో వాహన డ్రైవర్ బ్యాంక్ అకౌంట్ ను లింక్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఆటోమేటిగ్గా టోల్ ఫీజు అతడి అకౌంట్ నుంచి మినహాయించుకుంటారు. ఈ కొత్త విధానం ద్వారా టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఎలాంటి అవాంతరాలు లేని ప్రయాణం సాధ్యమవుతుంది. 

ఈ జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను తొలుత పైలెట్ ప్రాజెక్టుగా ఫాస్టాగ్ లకు అదనంగా అమలు చేయనున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి జీపీఎస్ వ్యవస్థను తీసుకువస్తామని చెప్పారు. 

కాగా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) సంస్థకు టోల్ ఫీజుల రూపంలో ఏడాదికి రూ.40 వేల కోట్ల ఆదాయం లభిస్తోందని, రానున్న రెండు మూడేళ్లలో అది రూ.1.40 లక్షల కోట్లకు పెరగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News