Nara Lokesh: విశాఖ ఎయిర్ పోర్టులో నారా లోకేశ్ కు ఘనస్వాగతం

  • ఫిబ్రవరి 11 నుంచి నారా లోకేశ్ శంఖారావం యాత్ర
  • ఉత్తరాంధ్రలో 31 నియోజకవర్గాల్లో యాత్ర
  • 11 రోజుల పాటు సాగనున్న శంఖారావం
Grand welcome for Nara Lokesh in Vizag airport

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్ర కోసం విశాఖ చేరుకున్నారు. ఈ సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్టులో నారా లోకేశ్ కు ఘనస్వాగతం లభించింది. 

లోకేశ్ శంఖారావం యాత్ర ఇచ్చాపురంలో రేపు (ఫిబ్రవరి 11) ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో, విశాఖకు వచ్చిన టీడీపీ యువనేతకు ఎయిర్ పోర్టులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అపూర్వస్వాగతం పలికారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ముఖ్యనేతలను లోకేశ్ పేరుపేరునా పలకరించారు. పార్టీ శ్రేణులకు అభివాదం చేసి ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గాన ఇచ్ఛాపురం బయల్దేరారు. 

ఇచ్ఛాపురంలో రేపటి శంఖారావం కోసం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇచ్ఛాపురంలో రేపు ఉదయం 10.30 గంటలకు లోకేశ్ శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. శంఖారావంలో పాల్గొనేందుకు ఇప్పటికే ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి టీడీపీ ముఖ్యనేతలు ఇచ్ఛాపురం చేరుకున్నారు. 

నారా లోకేశ్ యువగళం యాత్ర ఉత్తరాంధ్రలో పూర్తిగా జరగకుండానే ముగిసింది. ఆ లోటును శంఖారావం యాత్ర ద్వారా భర్తీ చేసుకోవాలని లోకేశ్ భావిస్తున్నారు. 

మొత్తం 11 రోజుల పాటు సాగే శంఖారావం యాత్రలో 31 నియోజకవర్గాల కేడర్ తో లోకేశ్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల  నేపథ్యంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. రేపు తొలి రోజు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో లోకేశ్ యాత్ర సాగనుంది.

More Telugu News