Narendra Modi: ప్రధాని మోదీ వారసుడిగా ఎవరైతే బాగుంటుంది?.. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ఆసక్తికర పేర్లు!

  • మోదీ వారసుడిగా అమిత్ షాను కోరుకున్న 29 శాతం మంది
  • యోగి ఆదిత్యనాథ్‌కు 25 శాతం, నితిన్ గడ్కరీకి 16 శాతం అనుకూలం
  • ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ఆసక్తికర జనాభిప్రాయం
Who would be good as Prime Minister Modis successor in BJP this is the answer of Mood of the Nation survey

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమని చెప్పిన ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే మరో ఆసక్తికర అంశంపై జనాభిప్రాయాన్ని వెల్లడించింది. బీజేపీలో ప్రధాని మోదీ వారసుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను 29 శాతం మంది, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను 25 శాతం మంది, నితిన్ గడ్కరీని 16 శాతం మంది కోరుకుంటున్నారని సర్వే వెల్లడించింది. కాగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేని డిసెంబర్ 15, 2023 నుంచి జనవరి 28, 2024 మధ్యకాలంలో నిర్వహించామని తెలిపింది.

ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని మోదీ అనడంలో సందేహం లేదు. అయితే బీజేపీ వ్యూహాలు, విజయాల వెనుక అమిత్ షా కూడా ఉన్నారు. అందుకే ఆయనను బీజేపీ 'చాణక్య'గా పిలుస్తుంటారు. ఇక ఉత్తరప్రదేశ్ మఖ్యమంత్రిగా రెండవ పర్యాయం బాధ్యతలు నిర్వర్తిస్తున్న యోగి ఆదిథ్యనాథ్ అనతికాలంలోనే బీజేపీలో విశేష ఆదరణ పొందారు. పార్టీ శ్రేణుల్లో తన ఇమేజ్‌ను పెంచుకున్నారు. కార్యకర్తల్లో గౌరవాన్ని పొందారు. హిందుత్వ నాయకుడు కావడం, వివాదాలు ఉన్నప్పటికీ నేరస్థుల అణిచివేతకు ఆయన అవలంబిస్తున్న విధానాలు ప్రజాదరణకు కారణవుతున్నాయి. ఇక రాజకీయ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటున్న అగ్రనేత నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి అయితే బావుంటుందని 16 శాతం మంది కోరుకుంటున్నారు. సమస్యలకు పరిష్కారం చూపగల వ్యక్తిగా పేరు పొందిన ఆయనను ప్రతిపక్ష నాయకులు సైతం ప్రశంసిస్తుంటారు. నితిన్ గడ్కరీ ప్రస్తుతం కేంద్ర రవాణా శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.

కాగా 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాని మోదీ ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ చరిష్మా అద్భుతంగా పనిచేసింది. ఇక ముచ్చటగా మూడోసారి కూడా బీజేపీ అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమని ‘ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే చెబుతోంది.

More Telugu News