Vijayashanti: ఎన్టీఆర్ కు కూడా ఇచ్చి వుంటే...: 'భారతరత్న' అవార్డులపై స్పందించిన విజయశాంతి

  • పీవీతో పాటు ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానీకం మరింత పులకించిపోయేదని వ్యాఖ్య
  • ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్లగలిగే అవకాశం మెండుగా కనిపిస్తోందన్న  విజయశాంతి 
  • ఈ ప్రయత్నం జరిగి తీరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకురాలు 
Vijayashanti demands Bharat Ratna award for Nandamuri Taraka Rama Rao

తెలుగుతేజం, దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’ పురస్కారం లభించిన వేళ కాంగ్రెస్ నాయకురాలు, సినీనటి విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న ప్రకటించి ఉంటే యావత్ తెలుగు ప్రజానీకం మరింత పులకించిపోయేదని, ఇది తిరుగులేని వాస్తవమని ఆమె అన్నారు. 

‘‘భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు. కానీ తెలుగుజాతి గౌరవ ప్రతీక పీవీ నరసింహారావుని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్‌కు కూడా ప్రకటించి ఉంటే యావత్ తెలుగు ప్రజానీకం మరింత పులకించిపోయేది. ఇది తిరుగులేని వాస్తవం. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్లగలిగే అవకాశం ఈ రోజున నిండుగా, మెండుగా కనిపిస్తోంది. ఈ బాధ్యతను భుజాలకెత్తుకుని, అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరుతుందని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని బలపరుస్తాయని కూడా నేను నమ్మడం అతిశయోక్తి కాదన్నది నా నిశ్చితాభిప్రాయం’’ అని విజయశాంతి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఆమె స్పందించారు. ఎన్టీఆర్‌ చేతుల మీదుగా నంది అవార్డు స్వీకరిస్తున్న పాత ఫొటోను ఈ సందర్భంగా విజయశాంతి షేర్ చేశారు.

More Telugu News