Sridhar Babu: ఆటో డ్రైవర్ల‌కు రూ.12 వేలు.. వచ్చే బడ్జెట్‌లో అమలు: తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు

  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి
  • ఆటో డ్రైవర్లకు చిన్నచిన్న సమస్యలు ఎదురవుతాయని మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నామన్న శ్రీధర్ బాబు
  • బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు సాయం చేశారా? అని ప్రశ్నించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Rs12000 for auto drivers from the next budget says Minister Sridhar Babu

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించడంతో ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి వుందని భరోసా ఇచ్చారు. ఏడాదికి రూ.12 వేలు అందజేస్తామని, వచ్చే బడ్జెట్‌లో ఈ హామీని కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. ఈ మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. చిన్నచిన్న సమస్యలు ఉత్పన్నమవుతాయని మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు కాంగ్రెస్‌ అభయమిచ్చిందని ప్రస్తావించారు.  గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్ బాబు ఈ సమాధానమిచ్చారు.

తెలంగాణ అభివృద్ధిపై సలహాలు సూచనలు ఇస్తే స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీధర్ బాబు చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు రాజకీయాలు వదిలి రాష్ట్ర ప్రగతిపై మాట్లాడాలని అన్నారు. అభివృద్ధి నిత్యం కొనసాగుతుందని, రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో ఎలాంటి భేషజాలు లేవని వ్యాఖ్యానించారు. ఒకరిద్దరికే అవకాశం ఇవ్వొద్దని రాహుల్‌ గాంధీ చెప్పారని, అందరికీ అవకాశం ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని, పెట్టుబడుదారులను రాష్ట్రానికి స్వాగతిస్తామని తెలిపారు.

మహిళలు ఉచితంగా బస్సుల్లో తిరిగితే మీకేంటి సమస్య?: మంత్రి పొన్నం ప్రభాకర్

మహిళలు బస్సుల్లో ఉచితంగా తిరిగితే ప్రతిపక్ష సభ్యులకేంటి సమస్య? అని మంత్రి పొన్నం ప్రభాకర్ విపక్ష సభ్యులను ప్రశ్నించారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ నైజమని మండిపడ్డారు. ఉచిత బస్సు టికెట్ల కోసం తమ ప్రభుత్వం రూ.530 కోట్లను ఇచ్చిందని ఆయన వెల్లడించారు. గత పదేళ్లలో ఆటోడ్రైవర్లకు నెలకు రూ.1000 సాయమైనా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మంత్రి సీతక్క ప్రశ్నించారు.

More Telugu News