PV Narasimha Rao: పీవీకి భారతరత్న రావడంపై రేవంత్ రెడ్డి, చిరంజీవి స్పందన

  • పీవీకి భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి
  • తెలంగాణ ప్రజల తరఫున పీవీ కుటుంబానికి శుభాకాంక్షలు చెప్పిన సీఎం
  • తెలుగువారే కాదు భారతీయులంతా అనందించే సమయం అన్న చిరంజీవి
Revanth Reddy and Chiranjeevi on Bharat Ratna to PV

పి.వి.నరసింహారావుకు భారతరత్న ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి మన దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. పీవీకి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వచ్చినందుకు ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రజల తరఫున ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 

'తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పి.వి.నరసింహారావు గారికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్.కె.అద్వానీ, కర్పూరీ ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ గార్లకు భారతరత్న రావడం సంతోషకరం' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి స్పందన

గొప్ప రాజనీతిజ్ఞుడు, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా ఆధునిక భారతదేశాన్ని తీర్చిదిద్దిన... భారత్ బలమైన ఆర్థిక శక్తిగా మారడానికి పునాదివేసిన పి.వి.నరసింహారావుకు భారతరత్న రావడం తెలుగువారందరికీ గర్వకారణమని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. తెలుగువారే కాదు భారతీయులంతా ఆనందించే విషయమన్నారు. ప్రపంచం చూసిన గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్తలలో ఒకరైన... మన దేశంలో హరితవిప్లవం నడిపించిన ఎం.ఎస్.స్వామినాథన్, రైతుల సంక్షేమం కోసం కృషి చేసిన చరణ్ సింగ్‌లకు కూడా భారతరత్న రావడం ఆనందించదగ్గ విషయమని చిరంజీవి అన్నారు. 'గొప్పతనం ఎప్పటికీ గుర్తించబడకుండా ఉండదని.. ప్రతిఫలం దక్కకుండాపోదని నిరూపించబడిన క్షణాలు' అంటూ పేర్కొన్నారు.

More Telugu News