AB De Villiers: కోహ్లీ-అనుష్క విషయంలో ఆ వ్యాఖ్యలపై డివిలియర్స్ యూటర్న్

AB De Villiers Stunning UTurn After Virushka Expecting 2nd Child Comments
  • విరుష్క దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారన్న డివిలియర్స్
  • అలా మాట్లాడి పెద్ద తప్పు చేశానన్న ఏబీడీ
  • తనకు అందిన సమాచారంలో నిజం లేదని వివరణ
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యల నుంచి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ యూటర్న్ తీసుకున్నాడు. ఆ వ్యాఖ్యలు నిజం కావని వివరణ ఇచ్చాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్నాడు. మిగతా మ్యాచుల్లోనూ ఆడేది, లేనిదీ స్పష్టత లేదు. 

రెండ్రోజుల క్రితం ఓ యూట్యూబ్ చానల్‌ లైవ్‌లో ఏబీడీ అభిమానులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని కోహ్లీతో మాట్లాడారా? అతడు బాగున్నాడా? అని ప్రశ్నించాడు. జవాబుగా ఏబీడీ మాట్లాడుతూ.. ఇటీవలే అతడితో చాట్ చేశా. ఎలా ఉన్నావని అడిగితే క్షేమమేనని చెప్పాడు. అతడు తన కుటుంబంతో గడుపుతున్నాడని, అందుకే ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరంగా ఉంటున్నాడని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి కోహ్లీ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నాడన్న మాట వాస్తవమేనని, ఇప్పుడతడు కుటుంబంతో ఉండడం అవసరమని పేర్కొన్నాడు.

కోహ్లీ రెండో బిడ్డపై తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా మాట్లాడుతూ.. గత వీడియోలో పెద్ద పొరపాటు చేశానని, తనకు అందిన సమాచారమంతా తప్పేనని, అందులో ఎలాంటి నిజం లేదని వివరణ ఇచ్చాడు. దీనిపై విరాట్ కుటుంబమే స్పష్టత ఇస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నాడు. విరాట్ విరామానికి కారణం ఏదైనా సరే.. అతడు త్వరగా, మరింత దృఢంగా జట్టులోకి రావాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.
AB De Villiers
Virat Kohli
Anushka Sharma
Team India

More Telugu News