Bonda Uma: వెల్లంపల్లి శ్రీనివాస్ కు సవాల్ విసిరిన బొండా ఉమా!

  • తాను కబ్జాలు, రౌడీయిజం చేసినట్టు చూపించాలని బొండా ఉమా సవాల్
  • ఒక దొంగని విజయవాడ సెంట్రల్ లో పెట్టారని విమర్శ
  • వెల్లంపల్లిపై ఆడపిల్లలను వేధించిన కేసులు ఉన్నాయని ఆరోపణ
Bonda Uma challenge to Vellampalli Srinivas

విజయవాడ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఈ నియోజకవర్గం టికెట్ ను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు సీఎం జగన్ కేటాయించిన సంగతి తెలిసిందే. మల్లాది విష్ణును పక్కన పెట్టి వెల్లంపల్లికి నియోజకవర్గ ఇంఛార్జీ బాధ్యతలను కట్టబెట్టారు. దీంతో మల్లాది విష్ణు వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది.

మరోవైపు వెల్లంపల్లి శ్రీనివాస్ కు, టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు బొండా ఉమాకు మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తనపై కబ్జా, రౌడీయిజం ఆరోపణలు చేసిన వెల్లంపల్లిపై బొండా ఉమా మండిపడ్డారు. తాను కబ్జాలు, రౌడీయిజం చేసినట్టు చూపించు అంటూ సవాల్ విసిరారు. విజయవాడ సెంట్రల్ లో నాకు టీడీపీ సీటు లేదని అంటున్నావ్... నీకు సీటు ఉందా? అని ప్రశ్నించారు. నీ బీఫామ్ చూపించు... నా బీఫామ్ చూపిస్తానని అన్నారు. ఇలాంటి మాటలతో 175 స్థానాల్లో గెలుస్తారా? అని ఎద్దేవా చేశారు. ఒక దొంగని విజయవాడ సెంట్రల్ లో వైసీపీ పెట్టిందని... పశ్చిమ చెత్తను తీసుకొచ్చి సెంట్రల్ లో వేసిందని అన్నారు. 

ఆడపిల్లలను వేధించిన కేసులు వెల్లంపల్లిపై ఉన్నాయని బొండా ఉమా చెప్పారు. ఈ విషయాన్ని ఎఫ్ఐఆర్ లతో చూపిస్తానని అన్నారు. రాజకీయ ప్రచారాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదని సర్క్యులర్ ఉన్నప్పటికీ... సెంట్రల్ నియోజకవర్గం వాలంటీర్లు పాల్గొంటున్నారని తెలిపారు. వీరికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు, కుక్కర్లు ఇచ్చారని ఆరోపించారు.

More Telugu News