Hong Kong Airport: విమానం చక్రాల కింద నలిగి వ్యక్తి మృతి.. హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్‌లో విషాద ఘటన

  • ‘టో ట్రక్’ జారి పడిన వ్యక్తి.. ట్రక్ లాక్కొస్తున్న విమానం తొక్కించడంతో మృతి
  • మంగళవారం తెల్లవారుజామున జరిగిన విషాద ఘటన
  • దర్యాప్తు చేపడుతున్నామని వెల్లడించిన హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్ అధికారులు
A person died as he being hit by plane  at Hong Kong Airport

హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్‌లో విషాదకర ఘటన జరిగింది. దురదృష్టవశాత్తూ విమానం చక్రాల కింద నలిగి ఓ గ్రౌండ్ వర్కర్ చనిపోయాడు. ఈ షాకింగ్ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. విమానాలను లాగడానికి ఉపయోగించే యంత్రం ‘టో ట్రక్’ సాయంతో ఓ విమానాన్ని లాక్కెళ్లుతుండగా గ్రౌండ్ వర్కర్ ట్రక్ నుంచి కిందపడ్డాడు. దీంతో వెనుకనే లాక్కొస్తున్న విమానం అతడి మీదుగా వెళ్లింది. దీంతో చక్రాల కింద నలిగి తీవ్ర గాయాలతో అతడు మృతి చెందినట్టు ఎయిర్‌‌పోర్టు అధికారులు వివరించారు.

మృతి చెందిన వ్యక్తి వయసు 34 సంవత్సరాలని, అతడు జోర్డాన్ పౌరుడని అధికారులు తెలిపారు. ‘టో ట్రక్‌’లో ప్రయాణికుల సీటులో కూర్చొని ప్రయాణిస్తుండగా కింద పడిపోయాడని, ట్రక్ లాక్కొస్తున్న విమానం అతడి పైనుంచి వెళ్లిందని వివరించారు. తీవ్రమైన గాయాలతో పడి ఉన్న అతడిని ఎమర్జెన్సీ స్టాఫ్ గుర్తించారని, అతడు అక్కడికక్కడే చనిపోయినట్టుగా నిర్ధారించారని పేర్కొన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని, ఈ ఘటనలో ట్రక్‌ను ప్రమాదకరంగా నడిపిన డ్రైవర్‌ అరెస్టయ్యాడని అధికారులు తెలిపారు.

కాగా మృతుడు గ్రౌండ్ సపోర్ట్, నిర్వహణ సంస్థ ‘చైనా ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీసెస్‌’లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడని హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ పేర్కొంది. ట్రక్‌లో ప్రయాణిస్తున్న సమయంలో సీటు బెల్ట్‌ ధరించలేదని అనుమానిస్తున్నామని చెప్పారు. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసిన డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నామని, ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై ‘చైనా ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీసెస్’ కంపెనీ ఇప్పటివరకు స్పందించలేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

More Telugu News